పెందుర్తి: చినముషిడివాడలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన శనివారం ఉద్రిక్తతకు దారితీసింది. పెందుర్తి తహసీల్దార్ ఐ.వెంకటఅప్పారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్ తెలిపిన వివరాల ప్రకారం.. చినముషిడివాడ సర్వే నంబర్ 185లోని ప్రభుత్వ గయాళి భూమిలో ఓ మహిళ అక్రమ నిర్మాణం చేపట్టినట్లు సమాచారం అందడంతో ఆయన రెవెన్యూ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. పరిశీలన అనంతరం అది ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణమని నిర్ధారించి తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు తొలగింపు ప్రక్రియను అడ్డుకొని రెవెన్యూ సిబ్బందిపై దాడికి దిగారు. అదే సమయంలో తహసీల్దార్ ఉన్న వాహనం వైపు కూడా దూసుకెళ్లి భయాందోళనకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పంగా చంద్రశేఖర్, దివాకర్, గొడ్డు అప్పలనాయుడు, సాయి, బోగేష్, కక్కల సంతోష్, నారాయణపురం అరుణపై తహసీల్దార్ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


