అంగన్‌వాడీల
కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీల ఆందోళన
మహారాణిపేట: లక్షలాది మంది చిన్నారుల ఆకలి తీర్చే మాతృమూర్తులు.. తమ ఆకలి కేకలు వినిపించేందుకు ‘రుద్రరూపం’ దాల్చారు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిన పాలకుల తీరుపై కన్నెర్ర చేస్తూ.. విశాఖ నడిబొడ్డున అంగన్‌వాడీ లోకం ఉప్పెనలా ఎగసింది. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం, ఎన్నికల హామీల అమలు కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు కదంతొక్కారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం నగరంలో ‘చలో కలెక్టరేట్’ ఉప్పెనలా సాగింది. జగదాంబ జంక్షన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి సాష్టాంగ నమస్కారం చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపి, అంగన్‌వాడీలు తమ పోరాటాన్ని ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు రహదారులన్నీ ఎర్రజెండాలతో పోటెత్తాయి.
కలెక్టరేట్ ముట్టడి.. ఉద్రిక్తత
ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్న అంగన్‌వాడీలు, ఒక్కసారిగా గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో, కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుటే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ఆ సమయంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.విశ్వేశ్వరనాయుడు ధర్నా స్థలానికి వచ్చారు. అంగన్‌వాడీ నేతలు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్‌వోకు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నేత బి.జగన్, జిల్లా నాయకులు నమ్మి రమణ, సోమేశ్, సత్యవతితో పాటు అంగన్‌వాడీ యూనియన్ నేతలు బృందావతి, మణి, పద్మావతి, శోభారాణి, తులసి, పావని, సాయి సరస్వతి, శ్రీదేవి, నర్సియమ్మ, కొవ్వాడ లక్ష్మి, ఇందిరా, కళ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
జగదాంబ నుంచి కలెక్టరేట్ వరకు మహా ప్రదర్శన
చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారంతో వినూత్న నిరసన
కలెక్టరేట్ ముట్టడి.. హామీలు అమలుచేయాలని డిమాండ్
అంగన్‌వాడీల ప్రధాన డిమాండ్లు
కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలి.
పెన్షన్, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలి.
పనిభారం పెంచుతున్న ‘నవచేతన’ యాప్‌ను తక్షణమే రద్దు చేయాలి.
బీఎల్‌వో డ్యూటీల నుంచి అంగన్‌వాడీలకు మినహాయింపు ఇవ్వాలి.
రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులు వెంటనే విడుదల చేయాలి
మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా
అప్‌గ్రేడ్ చేయాలి.
హెల్పర్ల ప్రమోషన్‌కు ఉన్న 5 ఏళ్ల
సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలి.


