రూ.1,111 కోట్ల ‘భూ’ దందా!
మధురవాడలో రూ.200 కోట్ల విలువగా ప్రభుత్వ భూమి బదిలీ
ప్రైవేట్‌కు ధారాదత్తం చేసేందుకే భారీ నజరానా
పైసా చెల్లించకుండానే ‘బుక్ అడ్జస్ట్‌మెంట్’ పేరుతో ఏపీటీడీసీకి కేటాయింపు
సాక్షి, విశాఖపట్నం: పర్యాటకాభివృద్ధి ముసుగులో మహా విశాఖలోని ఖరీదైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం మరో భారీ భూ బాగోతానికి తెరతీసింది. విశాఖ రూరల్ మండలం, మధురవాడ పరిధిలోని సర్వే నంబర్ 426/3లో ఉన్న 9.39 ఎకరాల భూమికి రూ.1,111 కోట్లు వసూలు చేయాలని సీసీఎల్‌ఏ సిఫార్సు చేసినా, ఆ నివేదికను బుట్టదాఖలు చేస్తూ బేసిక్ వాల్యూ పేరుతో దాని విలువను కేవలం రూ.199.96 కోట్లకు కుదించేశారు. పైగా ఏపీటీడీసీ వద్ద నిధులు లేవనే సాకుతో ఆ కొద్దిపాటి సొమ్మును కూడా వసూలు చేయకుండా, ‘బుక్ అడ్జస్ట్‌మెంట్’ మాయాజాలంతో భూమిని బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఆగమేఘాల మీద జీవో జారీ చేసింది. మార్కెట్‌లో వేల కోట్లు పలికే ఈ విలువైన ల్యాండ్‌ను ముందుగా ఏపీటీడీసీకి మార్చి, ఆపై పర్యాటకం పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా అప్పగించేందుకే ప్రభుత్వం ఈ ప్లాన్ వేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నేరుగా ఇస్తే రాయితీలుండవని..
స్టార్ హోటళ్లు, రిసార్టుల నిర్మాణం కోసం ఈ భూమిని కేవలం ఒక శాతం బేసిక్ వాల్యూకే డెవలపర్లకు లీజుకు అప్పగించేందుకు ఏపీటీడీసీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. భవిష్యత్తులో రాబోయే టూరిజం ప్రాజెక్టులకుగానీ, గతంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకుగానీ ఈ భూమిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఎలాంటి అడ్డంకులు లేకుండా.. 22–ఏ నుంచి కూడా ఈ భూమిని తొలగించింది.
రూ.1,100 కోట్లు వద్దు..
రూ.200 కోట్లు చాలు.
ఈ భూపందేరానికి సంబంధించి ఫైళ్లు చకచకా కదలడం, భూమి విలువ నిర్ధారణలో భారీ వ్యత్యాసం ఉండటం చూస్తుంటే దీని వెనుక ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున చక్రం తిప్పినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ ఈ ఏడాది మార్చి 10న భూ బదిలీకి ప్రతిపాదనలు పంపగా.. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఏపీఎల్‌ఎంఏ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేశారు. అయితే ఇక్కడే అసలు వ్యవహారం మొదలైంది. ఈ భూమి బదిలీకి సంబంధించి ఏకంగా రూ.1,111 కోట్లు చెల్లించాలని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తొలుత సిఫార్సు చేశారు. కానీ.. ఏపీటీడీసీ వద్ద నిధులు లేవన్న సాకుతో.. ఆ భూమి బేసిక్ వాల్యూని కేవలం సుమారు రూ.200 కోట్లుగా నిర్ధారించి.. ఆ మొత్తాన్ని కూడా చెల్లించకుండానే భూమిని ధారాదత్తం చేయడం విమర్శలకు దారితీస్తోంది. సుమారు రూ.900 కోట్లకు పైగా వ్యత్యాసంతో ఈ విలువైన భూమిని ఆగమేఘాల మీద బదిలీ చేయడం వెనుక భారీగానే ముడుపులు చేతులు మారినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సంస్థకు ఈ భూమిని హోటల్, రిసార్టుల నిర్మాణానికి అప్పగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. టూరిజం భూమి కింద ఇస్తే.. రాయితీల పేరుతో మరింత మొత్తం లాభపడొచ్చనే ఉద్దేశంతోనే.. ఈ స్థాయిలో వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది.


