డేటా సెంటర్లతో పర్యావరణానికి ముప్పు | - | Sakshi
Sakshi News home page

డేటా సెంటర్లతో పర్యావరణానికి ముప్పు

Jun 5 2026 12:06 AM | Updated on Jun 5 2026 12:06 AM

తాటిచెట్లపాలెం: గూగుల్‌ డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు పొంచివుందని ఢిల్లీ సైన్స్‌ ఫోరం ఫౌండర్‌, ఆలిండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ జాతీయ నాయకులు డి.రఘునందన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు వీటిని వ్యతిరేకిస్తుంటే, మన దేశంలో ప్రభుత్వాలే ఆహ్వానించడం ప్రమాదకరమన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం దొండపర్తిలోని ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ సెమినార్‌ హాల్‌లో ‘డేటా సెంటర్లు –విశాఖ పర్యావరణంపై ప్రభావం’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య వక్తగా విచ్చేసిన రఘునందన్‌ మాట్లాడుతూ.. అమెరికా, ఐరోపా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజల వ్యతిరేకత వల్లే ఇవి ఏర్పాటు కాలేదన్నారు. వీటి వల్ల భారీగా నీరు, విద్యుత్‌ వినియోగంతో పాటు రేడియేషన్‌ సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. అలాగే మన డేటాపై విదేశీ నియంత్రణ ఉండి, పారదర్శకత ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం వాస్తవాలను మభ్యపెడుతూ 1 గిగాకు బదులు మూడు ప్రాంతాల్లో సుమారు 2.5 గిగా డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. విశాఖలోని సింహాచలం, ఆనందపురం వంటి నివాస ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు. వీటిపై విద్యార్థులు, మేధావులు, ప్రజాసంఘాల సహకారంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి జి.మురళీధర్‌, రాష్ట్ర కార్యదర్శి జి.గిరిధర్‌, హెల్త్‌ సబ్‌ కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్‌ డాక్టర్‌ ఎం.రమేష్‌కుమార్‌, ఎన్‌.చంద్రశేఖర్‌, మానవ హక్కుల వేదిక అధ్యక్షులు వీఎస్‌ కృష్ణ, ప్రతినిధులు త్రినాథరావు, కామేశ్వర్రావు, జీవీ రమణ, పెద్ద సంఖ్యలో పర్యావరణవేత్తలు పాల్గొన్నారు.

ఢిల్లీ సైన్స్‌ ఫోరం ఫౌండర్‌ రఘునందన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement