మద్దిలపాలెం: గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన దళితులు, రైతుల సమస్యలను ఈ నెల 25లోగా పరిష్కరించకపోతే చలో తర్లువాడ కార్యక్రమం చేపడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. పిఠాపురంకాలనీలోని ఏచూరి భవన్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 28న జరగనున్న డేటా సెంటర్ శంకుస్థాపనను ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. తర్లువాడ, అడవివరం, రాంబిల్లి మండలాల్లో 520 మంది రైతులకు పరిహారం చెల్లించకుండా, 601 ఎకరాలను బలవంతంగా సేకరించడం అన్యాయమని మండిపడ్డారు. గూగుల్ పేరుతో సేకరించిన భూమిని అదానీ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయడమేంటని ప్రశ్నించారు. 1.50 లక్షల ఉద్యోగాలంటూ ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ముంచుతోందని, పర్యావరణ నివేదికలు లేకుండా, సామాజిక అధ్యయనం నిర్వహించకుండా శంకుస్థాపన చేయడం తగదన్నారు. దీని వల్ల నగర ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ల కోసం విశాఖ ప్రజల ప్రాణాలను ప్రభుత్వం ఫణంగా పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గూగుల్ డేటా డేటా సెంటర్ వల్ల ఐదారు వేల కంటే ఎక్కవు ఉద్యోగాలు రావని కేంద్ర మంత్రులు చెబుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం 1.50 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పడం మోసమేనన్నారు. రూ.1.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టగలిగిన అతి పెద్ద గూగుల్ సంస్థకు విద్యుత్, రోడ్లు, నీరు, ట్యాక్స్ ఫ్రీ వంటి సదుపాయాలు, రూ.22 వేల కోట్లు రాయితీ ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చిందన్నారు. సొంత నియోజకవర్గంలో భూములు కోల్పోయిన రైతులు, దళితులకు పరిహారం ఇప్పించకుండా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్పొరేట్ సేవలో తరిస్తున్నారని ఆరోపించారు. సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాలను గూగుల్‌కు కేటాయించినప్పు డు అడ్డురాని దేవదాయ చట్టం, పంచగ్రామాల ప్రజల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ఎందుకు అడ్డువస్తోందని నిలదీశారు. కొద్దిమంది టీడీపీ కార్యకర్తలు లబ్ధిపొందేలా సంపాదించుకోండి, తినండి, పదవులు పొందడి అని పథకాన్ని ప్రవేశపెట్టారని ఎద్దేవా చేశారు. 22ఎ నుంచి సాధారణ రైతుల భూములను తొలగించడానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. సీపీఎం నాయకులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, ఆర్.ఎస్.ఎన్.మూర్తి పాల్గొన్నారు.


