ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం

Apr 13 2026 7:50 AM | Updated on Apr 13 2026 7:50 AM

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

బీచ్‌రోడ్డు: పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, రెండేళ్లలో రాష్ట్ర వైద్య రంగం అద్భుతమైన వృద్ధిని సాధించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. ఆదివారం చెస్ట్‌ అండ్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ ఆసుపత్రిలో కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌తో కలిసి ఎండో బ్రాంకియల్‌ అల్ట్రా సౌండ్‌ మెషీన్‌తో పాటు, ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన వాటర్‌ ఫౌంటైన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోనే ఇటువంటి అత్యాధునిక అల్ట్రా సౌండ్‌ మిషన్‌ ఇక్కడ అందుబాటులోకి వచ్చిందని, ఇది ఈ ప్రాంత రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే కర్నూలు, విశాఖపట్నం, కడప, గుంటూరులలో అత్యాధునిక క్యాన్సర్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి కాకినాడ, అనంతపురంలో కూడా కాంప్రహెన్సివ్‌ క్యాన్సర్‌ సెంటర్లను పూర్తి చేసి, క్యాన్సర్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌ దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు. అలాగే డయాలసిస్‌ మిషన్ల సంఖ్యను 550 నుంచి 725కు పెంచినట్లు వివరించారు. కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ మాట్లాడుతూ.. సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా ఆసుపత్రుల్లో మరిన్ని వనరులు సమకూర్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. విశాఖపట్నాన్ని గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని చెప్పా రు. ఎన్టీఆర్‌ వైద్య సేవ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌, చెస్ట్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ సునీల్‌ కుమార్‌, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్యారాణి, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement