మహారాణిపేట: తూర్పు తీరంలో మత్స్య సంపద వేట నిలిచిపోనుంది. మత్స్య సంపద పునరుత్పత్తి, పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతి ఏటా విధించే 61 రోజుల వేట నిషేధం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానుంది. జూన్ 15వ తేదీ వరకు కొనసాగే ఈ విరామం వల్ల సముద్రంలో యాంత్రిక, మోటరైజ్డ్ బోట్ల కదలికలు పూర్తిగా ఆగిపోనున్నాయి. జిల్లాలోని 65 కిలోమీటర్ల తీర ప్రాంతం, 32 మత్స్యకార గ్రామాలు, 15 ఫిష్ లాండింగ్ కేంద్రాల్లోని సుమారు 749 మరపడవలు, 1310 మోటారు బోట్లు జెట్టీలకే పరిమితం కానున్నాయి. దీనివల్ల వేటపై ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్న 25 వేల మంది మత్స్యకారులతో పాటు, హార్బర్‌పై పరోక్షంగా ఆధారపడే దాదాపు లక్ష కుటుంబాలకు ఈ రెండు నెలలు విరామం లభించినట్లయింది.
మత్స్యకారుల తీవ్ర నిరాశ
ఈ ఏడాది వేట సీజన్ మత్స్యకారులను తీవ్ర నిరాశకు గురిచేసింది. గత సీజన్‌లో మత్స్య సంపద ఆశించిన స్థాయిలో లభించకపోవడం, పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవడంతో బోటు యాజమానులు భారీ నష్టాలను చవిచూశారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం అందకపోవడం, ఆయిల్ సబ్సిడీ సకాలంలో రాకపోవడం వంటి సమస్యలు వీరిని మరింత కుంగదీశాయి. స్వల్ప కాల వేటలు సైతం లాభసాటిగా లేకపోవడంతో, నిషేధ కాలానికి ముందే చాలామంది తమ బోట్లను ఒడ్డుకు చేర్చేశారు. మత్స్య సంపద అభివృద్ధి కోసం ప్రభుత్వం విధిస్తున్న ఈ నిషేధానికి మత్స్యకారులందరూ సహకరించాలని మత్స్యశాఖ అధికారులు కోరుతున్నారు.
జిల్లాలో తీరప్రాంతం 65 కి.మీ. మత్స్యకార గ్రామాలు : 32 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు : 15 మరపడవలు : 749 మోటారు బోట్లు : 1310 ప్రత్యక్షంగా ఆధారపడేవాళ్లు 25 వేల మంది పరోక్షంగా..: లక్ష కుటుంబాలు
సముద్ర సంపదను కాపాడుకుందాం
తూర్పు తీరంలో మత్స్య సంపద పునరుత్పత్తికి ఏప్రిల్ నుంచి జూన్ వరకు అత్యంత కీలకమైన సమయం. ఈ నేపథ్యంలో మత్స్య సంపద పరిరక్షణ, నిర్వహణ దృష్ట్యా మంగళవారం నుంచి జూన్ 14వ తేదీ వరకు (మొత్తం 61 రోజులు) సముద్రంలో వేట నిషేధాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నాం. చేపల సంతతి వృద్ధి చెందడానికి ప్రకృతిపరంగా లభించే ఈ విరామ సమయాన్ని మత్స్యకారులు గౌరవించాలి. సముద్రమే జీవనాధారంగా బతుకుతున్న మత్స్యకార సోదరులంతా ఈ వేట నిషేధానికి కట్టుబడి ఉండాలి.
– పి.లక్ష్మణరావు, జాయింట్ డైరెక్టర్, మత్స్యశాఖ, విశాఖపట్నం.


