పెందుర్తి: పంచగ్రామాల భూ సమస్య కారణంగా గత 28 ఏళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ నాయకుడు డాక్టర్ బి.గంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం, పంచగ్రామాల భూముల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వేపగుంట జంక్షన్ నుంచి గోపాలపట్నం పెట్రోల్ బంక్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ.. ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న వారంతా జీవీఎంసీకి ఆస్తి పన్ను, నీటి పన్ను, విద్యుత్ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారని, అయినా వారందరినీ ఆక్రమణదారులుగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు. కార్పొరేట్ సంస్థలకు, గూగుల్ డేటా సెంటర్ కోసం సింహాచలం దేవస్థానం భూములను కట్టబెడుతున్న ప్రభుత్వం.. సామాన్య ప్రజల విషయంలో ఎందుకు వివక్ష చూపుతోంది? అని ప్రశ్నించారు. సంఘం కార్యదర్శి టి.వి.కృష్ణంరాజు మాట్లాడుతూ.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా హామీలే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. 2014లో విశాఖలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలోనూ ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ఇటీవల అసెంబ్లీలో సైతం కూటమి ఎమ్మెల్యేలు 1903 సర్వే సెటిల్‌మెంట్ రికార్డుల ప్రకారం రైతులకు హక్కులు ఉన్నాయని అంగీకరించారని, దానిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. 1903 సర్వే సెటిల్‌మెంట్ రికార్డుల ప్రకారం రైతులు, యజమానుల హక్కులను గుర్తించాలని, 1996–97లో సింహాచలం దేవస్థానానికి ఇచ్చిన రైత్వారీ పట్టాలను చట్ట సవరణ ద్వారా రద్దు చేసి, రైతులకు చెందిన 1,785 ఎకరాలను మినహాయించాలని, ఇళ్ల నిర్మాణాలు, స్థలాల క్రయవిక్రయాలకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ సమస్యను పరిష్కరించకపోతే, ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 17 వార్డుల్లో కూటమి అభ్యర్థులను ఓడిస్తామని హెచ్చరించారు. నాయకులు రమణి, విబిన్ ప్రతాప్, పి.రామారావు, కె.ఆర్.కె.ప్రసాద్, సిహెచ్.సత్యనారాయణ, ఈశ్వరరావు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
వేపగుంట నుంచి గోపాలపట్నం వరకు
పంచగ్రామ భూ నిర్వాసితుల పాదయాత్ర


