మళ్లీ మళ్లీ అవే..సమస్యలు ఫిర్యాదులు చేస్తున్నా కనిపించని పరిష్కారం కాళ్లరిగేలా తిరుగుతున్న ప్రజలు కుంటి సాకులతో కాలయాపన చేస్తున్న అధికారులు
మహారాణిపేట: ప్రభుత్వం భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన ‘రెవెన్యూ క్లినిక్’లు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి మారింది. గతంలో పీజీఆర్‌ఎస్ ద్వారా అందిన విన్నపాలు కొలిక్కి రాకపోవడంతో, ఇప్పుడు రెవెన్యూ క్లినిక్‌లను ఆశ్రయించినా బాధితులకు నిరాశే ఎదురవుతోంది.
దూరమవుతున్న పాలన..
భారమవుతున్న ప్రయాణం
గతంలో ప్రజలు తమ మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో వినతులు ఇచ్చేవారు. కానీ ప్రస్తుత విధానం ప్రకారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్యులకు సమయం, డబ్బు వృథా అవుతున్నాయి. మరోవైపు సోమవారం తహసీల్దార్లు, ఆర్డీవోలు తమ కార్యాలయాల్లో ఉండకుండా కలెక్టరేట్‌కే పరిమితం కావడంతో స్థానికంగా పనులు కాక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.
దాదాపు 60 శాతం పైగా దరఖాస్తులు ఇంకా వివిధ దశల్లోనే ఉండటం యంత్రాంగం మందకొడితనాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా పట్టణ పరిధిలో భూ సమస్యలపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నా, క్షేత్రస్థాయి అధికారుల నుంచి స్పందన కరువవుతోంది.
అధికారులను వణికిస్తున్న నిషేధిత జాబితా
భూములను 22ఏ (నిషేధిత జాబితా) నుంచి తొలగించే అంశం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో పొరపాటున ఈ జాబితాలో చేరిన జిరాయితీ భూములను బయటకు తీయడానికి ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తున్నారు. బాధ్యత తీసుకోవాల్సి వస్తుందనే భయంతో ఫైళ్లను కొర్రీలు వేసి వెనక్కి పంపడం లేదా అమరావతిలోని సీసీఎల్‌ఏ కార్యాలయానికి పంపి చేతులు దులుపుకుంటున్నారు.
మొక్కుబడిగా 14 రకాల సేవలు
రీ–సర్వే లోపాలు, మ్యుటేషన్లు, ఎఫ్–లైన్ పిటిషన్లు, అక్రమణలు వంటి 14 రకాల కీలక అంశాలపై వినతులు స్వీకరిస్తున్నా.. పరిష్కారం మాత్రం మొక్కుబడిగా సాగుతోంది. పది దశల సుదీర్ఘ ప్రక్రియ వల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదని, రెవెన్యూ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఈ క్లినిక్‌ల లక్ష్యం నెరవేరుతుందని బాధితులు వాపోతున్నారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ నెల
6వ తేదీ వరకు అందిన దరఖాస్తులు
మొత్తం వినతులు 1,046
పరిష్కరించినవి 171
తిరస్కరించినవి 341
పెండింగ్‌లో ఉన్నవి 534


