నాడు భరోసా | - | Sakshi
Sakshi News home page

నాడు భరోసా

Mar 14 2026 7:22 AM | Updated on Mar 14 2026 7:22 AM

నేడు నిరాశ
6,499 మంది రైతులకు ఎగనామం
ఎన్నికలకు ముందు రైతులందరికీ ‘అన్నదాత సుఖీభవ’ హామీ అధికారంలోకి వచ్చాక కొందరికే కూటమి సాయం వైఎస్సార్‌ సీపీ హయాంలో 25,072 మందికి రైతు భరోసా చంద్రబాబు ప్రభుత్వంలో 18,573 మందికే నగదు జమ

కౌలు రైతులకు మొండిచేయి

మహారాణిపేట: ఎన్నికల ముందు ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చాక అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ఉదరగొట్టిన కూటమి నేతలు, తీరా అమలు సమయానికి కోతల పర్వానికి తెరలేపారు. శుక్రవారం మూడో విడత నిధుల విడుదల సందర్భంగా ప్రభుత్వం అనుసరించిన వైఖరి చూస్తుంటే.. రైతులను ఆదుకోవడం కంటే వారిని పథకం నుంచి ఎలా తొలగించాలనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. రెండో ఏడాదిలోనూ అరకొర నిధులతోనే సరిపెట్టింది. మూడో విడత కింద పెద్ద సంఖ్యలో అర్హులైన రైతులకు పెట్టుబడి సాయాన్ని దూరం చేసింది. అలాగే.. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌ రూ.2 వేలకు, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.4 వేలు జత చేసి మమ అనిపించింది. ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని నమ్మించి, నేడు హామీ ప్రకారం నిధులు ఇవ్వకుండా రైతులను వంచిస్తోందని కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కౌలు రైతులకు మొండిచేయి

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు భరోసా అమలు చేశారు. జిల్లాలో 25,072 మంది రైతులకు నేరుగా నగదు జమ చేశారు. కానీ, నేడు చంద్రబాబు ప్రభుత్వం కేవలం 18,573 మందికి మాత్రమే రూ.7.43 కోట్ల నిధులు జమ చేసింది. ఏకంగా 6,499 మంది రైతులకు మొండిచేయి చూపింది. 17,050 మంది రైతులకు కేంద్రం నుంచి రూ.3.41 కోట్లు రైతులకు జమ అయ్యాయి. కాగా.. గత ప్రభుత్వం 10 సెంట్ల భూమి ఉన్న చిన్న రైతులకు కూడా సాయం అందించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడా లేని నిబంధనలు అమలు చేస్తోంది. కుటుంబంలో ఒక్కరికే లబ్ధి అనే నిబంధన పెట్టింది. 10 సెంట్ల లోపు భూమి ఉన్నవారిని తొలగించింది. ఆధార్‌, ఈ–కేవైసీ, బ్యాంక్‌ అనుసంధానం వంటి సాంకేతిక సాకులు చెప్పి వేలాది మందిని అనర్హులుగా మార్చింది. ముఖ్యంగా, కౌలు రైతులకు ఈ విడతలోనూ మొండిచేయి ఎదురైంది. మూడో విడతలో న్యాయం జరుగుతుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి వేలిముద్రలు వేయాలని, ఓటీపీలు చెప్పాలని నిబంధనలు పెట్టడం వల్ల వృద్ధులు, చదువుకోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మొదటి ఏడాది నుంచే మోసం

అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వకుండా మొదటి ఏడాది నుంచే మమ్మల్ని మోసం చేస్తున్నారు. నేను 1.90 ఎకరాల ఈనాం భూమిని సాగు చేసుకుంటున్నాను. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ రైతు భరోసా కింద లబ్ధి పొందాను. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒక్క విడత కూడా డబ్బులు జమ కాలేదు. దీంతో సాగు పెట్టుబడి కోసం బయట వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అప్పులు తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నాను. ప్రభుత్వం స్పందించి నాకు న్యాయం చేయాలి.

– కె.శ్రీనివాసరావు, రైతు, బొత్సపేట

రెండు విడతలు మొండిచేయే..

చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ నిధులు అందడం లేదు. మొదటి ఏడాది పథకం అమలు చేయలేదు. రెండో ఏడాదిలో రెండు విడతల్లో పైసా రాలేదు. గత ప్రభుత్వంలో ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా అందాయి. నా పేరిట 1.50 సెంట్లు, భార్య సిమ్మప్ప పేరిట 3 ఎకరాలు, కుమారుడు శివ పేరిట 30 సెంట్లు భూమి ఉన్నప్పటికీ, మా కుటుంబంలో ఒక్కరికి కూడా సాయం అందడం లేదు. మూడు విడతలు కలిపి ప్రభుత్వం రూ.20,000 ఇవ్వాల్సి ఉంది. పెట్టుబడి కోసం బ్యాంకు అప్పులు తెచ్చి సాగు చేస్తున్నాం. మూడో విడత అయినా వస్తుందో లేదో!

– బి.సన్నిబాబు, రైతు, మద్ది గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement