మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వర్సిటీ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి రూ.700 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ తెలిపారు. ఇందులో హెరిటేజ్ యూనివర్సిటీగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి రూ.200 కోట్లు, విద్యార్థుల మౌలిక సదుపాయాల అభివృద్ధి, బ్యూటిఫికేషన్, పురాతన భవనాల ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.500 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. రాష్ట్రంలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఏకై క విశ్వవిద్యాలయం ఏయూ కావడం గర్వకారణమన్నారు. ఈ ప్రాజెక్టుల వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు వివరించామని, నిధుల మంజూరుకు ఆయన కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం కార్పొరేట్ తరహాలో ఐకానిక్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ నిర్మాణం ప్రతిపాదనల్లో ప్రధానంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే వెయ్యి మందికి సరిపడే మెగా మెస్, హాస్టళ్లు, అకడమిక్ కాన్ఫరెన్స్ హాల్ విస్తరణ, లైబ్రరీ డిజిటలైజేషన్ వంటి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే అధ్యాపకుల తరగతులను రికార్డు చేయడానికి ప్రత్యేక స్టూడియో ఏర్పాటు చేసి వాటిని ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రతిపాదనల్లో ప్రధాన ద్వారాల ఆధునీకరణ, రంజనీ గెస్ట్ హౌస్, వీసీ బంగ్లా పునరుద్ధరణ, భారీ కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఫిజిక్స్ భవనం వద్ద సెంటీనరీ పార్క్ ఏర్పాటు, అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు ఉన్నాయి. అదేవిధంగా క్వాంటమ్ టెక్నాలజీ కోర్సులకు రూ.50 కోట్లతో ల్యాబ్, సెమీకండక్టర్ ల్యాబ్‌ను ఆధునిక స్థాయిలో ఏర్పాటు చేయడానికి మరో రూ.50 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. ఆర్ట్స్, లా, కామర్స్ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ కంపిటెన్సీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు, ల్యాబ్‌లలో అత్యాధునిక పరికరాలు, మౌలిక సదుపాయాల కోసం రూ.100 కోట్లు, శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు రూ.25 కోట్లు కోరినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలతో మెగా మెస్, ఒక బాలికల హాస్టల్, రెండు బాలుర హాస్టళ్లు నిర్మాణం, అలాగే వర్సిటీలోని కీలక విభాగాలకు చెందిన తొమ్మిది భవనాల ఆధునికీకరణ చేపట్టాలని ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.


