4 | - | Sakshi
Sakshi News home page

4

Mar 14 2026 7:22 AM | Updated on Mar 14 2026 7:22 AM

ఆగమేఘాల మీద ఆమోదం ముగిసిన జీవీఎంసీ చివరిస్థాయీ సంఘ సమావేశం

293

గంటలు..

అంశాలు

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ ప్రస్తుత పాలకవర్గ చిట్టచివరి స్థాయీ సంఘ సమావేశం శుక్రవారం జరిగింది. మేయర్‌, స్థాయీ సంఘం చైర్మన్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిర్ణయాలు ఆగమేఘాల మీద జరిగిపోయాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలో 294 అంశాలపై చర్చించి, అందులో ఏకంగా 293 అంశాలకు సభ్యులు ఆమోదముద్ర వేయడం గమనార్హం. ఈ నెల 17వ తేదీతో ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం ముగియనుండటంతో ఇదే వారి చివరి సమావేశం. ఉదయం 11.45కు ప్రారంభమైన సమావేశంలో మధ్యాహ్నం 1.30 వరకు 193 అంశాలను ఆమోదించారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు మరో 101 టేబుల్‌ అజెండా అంశాలను క్లియర్‌ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. తన పదవీ కాలంలో అందరి సహకారంతో నగరంలో మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధికి విశేషంగా కృషి చేశానని తెలిపారు.

వివాదాస్పద బిల్లులను ఆమోదించేశారు

గతేడాది యోగా దినోత్సవం సందర్భంగా మొబైల్‌ టాయిలెట్ల ఏర్పాటు కోసం సుమారు రూ.1.62 కోట్ల చెల్లింపులకు అప్పట్లో అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనంతో గత స్థాయీ సంఘ సమావేశంలో సభ్యులు భగ్గుమన్నారు. అప్పట్లో మేయర్‌ ఈ బిల్లులను వాయిదా వేశారు. అధికారులు వివరణ ఇచ్చారో లేదో తెలియదు కానీ, ఈ చివరి సమావేశంలో ఆ పాత బిల్లులను మళ్లీ అజెండాలో పెట్టి ఆమోదించడం చర్చనీయాంశమైంది.

టాయిలెట్లలో ఏసీలు బిగించారా?

మొబైల్‌ టాయిలెట్ల అద్దె బిల్లుల్లో ఉన్న భారీ వ్యత్యాసాలపై సభ్యులు అధికారులను తీవ్ర స్థాయిలో నిలదీశారు. సీఎం పర్యటనకు ఏర్పాటు చేసిన టాయి లెట్లకు రూ.8 వేలు, పీఎం యోగా డే కార్యక్రమానికి రూ.16 వేలు బిల్లు చూపించిన అధికారులు.. ఇటీవల జడ్జిల కార్యక్రమానికి ఏకంగా రూ.30 వేలు చూపించడంపై విస్మయం వ్యక్తం చేశారు. ‘ఒక్కో టాయిలెట్‌కు 30 వేలా? అందులో ఏమైనా ఏసీలు బిగించారా?’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఆ అజెండాను సైతం ఆమోదించేయడం విశేషం.

కారుణ్య నియామకాలకు ఇప్పుడా?

జీవీఎంసీలో ముగ్గురికి జూనియర్‌ అసిస్టెంట్లుగా కారుణ్య నియామకాలు చేపట్టే అంశంపై విస్తృత చర్చ జరిగింది. వీరు 2024లోనే ఎంపికై నప్పటికీ, 2026 వరకు నియామక పత్రాలు ఎందుకు ఇవ్వలేదని సభ్యులు ప్రశ్నించారు. ఈ జాప్యం వెనుక భారీగా నగదు చేతులు మారినట్లు తమకు అనుమానాలున్నాయని ఆరోపించారు. దీనిపై అదనపు కమిషనర్‌ సత్యవేణి స్పందించి సభ్యులకు వివరణ ఇచ్చారు.

ఒకే ఒక్క అంశం వాయిదా

సమావేశంలో వాయిదా పడిన ఏకై క అంశం గాజువాకలోని క్లోజ్డ్‌ కాంపాక్షన్‌ సిస్టం మరమ్మతుల వ్యవహారం. దీని కోసం రూ.49 లక్షలు ఖర్చు చేయాలన్న ప్రతిపాదనను సభ్యుడు రాపర్తి కన్నా తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత చూసిన రాశా సంస్థే ఆ మరమ్మతులు చేయాల్సి ఉండగా, జీవీఎంసీ నిధులు ఎందుకు ఖర్చు చేస్తున్నారని నిలదీశారు. కాంట్రాక్టర్‌ నుంచే రికవరీ చేస్తామని అధికారులు చెప్పగా.. గత ఏడాదిన్నరగా ఇదే మాట చెబుతున్నారు, ఆచరణలో శూన్యం అని సభ్యులు పెదవి విరిచారు. రికవరీ అయిన తర్వాతే ఆమోదిద్దామంటూ ఈ ఒక్క అంశాన్ని వాయిదా వేశారు. సమావేశంలో సీఎంవోహెచ్‌ డాక్టర్‌ నరేష్‌ కుమార్‌, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వాసుదేవరెడ్డి, కార్యదర్శి బి.వి.రమణ, డీసీ ఎస్‌. శ్రీనివాసరావు, జోనల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. మంగళవారంతో పాలకవర్గ గడువు ముగుస్తుండటంతో, స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో కార్పొరేటర్లందరూ వీడ్కోలు విందు చేసుకోనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement