స్కెచ్!
ఓపెన్ టిప్పర్లలో చెత్త తరలించినా
ఫ్రీగా ఆయిల్ ఇవ్వాల్సిందే..
లేదంటే మా టెండర్ రద్దు చేయాలని
కమిషనర్‌కు నేరుగా రాశా సంస్థ లేఖ
అయినా టెండర్లను అప్పగించిన
జీవీఎంసీ అధికారులు
సీసీఎస్ ప్రాజెక్టుల టెండర్లలో వింతలు
డీజిల్ గల్లంతుకు
సీసీఎస్
ప్రాజెక్టుల్లో
చెత్తతోనే కాదు.. వివాదాలతో నిండిన సీసీఎస్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
‘క్లోజ్‌డ్ కంపాజిషన్ సిస్టం (సీసీఎస్) ప్రాజెక్టు కోసం తాజాగా పిలిచిన టెండర్‌లో ఓపెన్ టిప్పర్లలో చెత్తను తరలిస్తే జీవీఎంసీ డీజిల్‌ను సరఫరా చేయదు.. ఉచితంగా డీజిల్ ఇవ్వమంటూ పెట్టిన నిబంధనను వెనక్కి తీసుకోకపోతే మేం దాఖలు చేసిన టెండర్‌ను వెనక్కి తీసుకున్నట్టు భావించండి. మేం వేసిన టెండర్ అమలులో ఉండదు’’ అంటూ సీసీఎస్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్న రాశా సంస్థ స్వయంగా గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్‌తో పాటు మెకానికల్ అధికారులకు గత నెలలోనే లేఖలు రాసింది. అయినప్పటికీ పనులను కట్టబెడుతూ కమిషనర్ నిర్ణయం తీసుకోవడం.. మెకానికల్ అధికారులు సదరు సంస్థకు పనులను అప్పగిస్తూ ఆదేశాలు జారీచేయడం గమనార్హం. ఈ పనులను అప్పగించడం వెనుక జీవీఎంసీ అధికారుల వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే జీవీఎంసీ ఖజానా నుంచి అదనపు ఆయిల్‌ను ఉచితంగా ఇచ్చేందుకే నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. వాస్తవానికి సీసీఎస్ ప్రాజెక్టుల ఉద్దేశమే క్లోజ్‌డ్ కంపాక్టర్ల ద్వారా చెత్తను తరలించడం. అయితే ఇప్పటికే ఒక క్లోజ్‌డ్ కంపాక్టర్ పోలీసు స్టేషన్‌లో మరొకటి మరమ్మతుల పేరుతో నెలల తరబడి షోరూంలో ఉంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ నుంచి ఉచితంగా ఆయిల్‌ను తీసుకుని కాపులుప్పాడలోని విద్యుత్ ప్లాంటుకు ఓపెన్ టిప్పర్లలో తరలిస్తున్నారు. ఈ దఫా టెండర్లలో ఓపెన్ టిప్పర్ల ద్వారా చెత్తను తరలించేందుకు వీలులేదని.. ఒకవేళ తరలిస్తే జీవీఎంసీ ఉచితంగా డీజిల్‌ను సరఫరా చేయదనే నిబంధన విధించారు. అయితే ఈ నిబంధన తొలగించకుంటే తాము దాఖలు చేసిన టెండర్‌ను పరిగణలోనికి తీసుకోవద్దంటూ స్వయంగా రాశా యాజమాన్యం లేఖ రాసింది. అయినప్పటికీ చేయాల్సిందేంటూ రెండు సీసీఎస్ ప్రాజెక్టులను సదరు సంస్థకు అప్పగించారు. అంటే ఉచితంగా డీజిల్‌ను ఇచ్చేందుకు జీవీఎంసీ నిర్ణయం తీసుకుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ ప్రాజెక్టు నుంచి కోట్ల రూపాయల డీజిల్‌ను ఉచితంగా ఇచ్చేందుకే ఈ బాగోతం నడిచిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
కమిషనర్‌కు తెలియదా..!
వాస్తవానికి సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణపై కమిషనర్ స్వయంగా సమీక్ష నిర్వహించడమే కాకుండా వీటిపై విచారణ కూడా చేపట్టారు. నిర్వహణ విషయంలో పక్కాగా ఉండాలంటూ ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో తాజా టెండర్లలో ఓపెన్ టిప్పర్ల ద్వారా చెత్త తరలించకుండా ఉండేందుకు కొన్ని నిబంధనలను చేర్చారు. అయితే, ఈ నిబంధన ఉంటే తమ టెండర్‌ను పరిగణలోకి తీసుకోవద్దన్న రాశా సంస్థ లేఖను సైతం పక్కనపెట్టి పనులను అప్పగించారు. ఇంతకీ ఈ విషయం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్‌కు వాస్తవాలు తెలియకుండా జీవీఎంసీ కిందిస్థాయి అధికారులు వ్యవహారం నడిపించారా? అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
అవినీతి కొండలు..!
జీవీఎంసీ పరిధిలోని 10 జోన్ల నుంచి ప్రతీ రోజూ 1,200 టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. ఇంటింటికీ వెళ్లి క్లాప్ వాహనాల ద్వారా చెత్తను సేకరిస్తున్నారు. ఈ విధంగా సేకరించిన చెత్తను జీవీఎంసీ పరిధిలోని 4 సీసీఎస్ ప్రాజెక్టులకు (గాజువాక, టౌన్‌కొత్త రోడ్డు, చీమలాపల్లి, ముడసర్లోవ) తరలిస్తున్నారు. అక్కడి నుంచి క్లోజ్‌డ్ కాంపాక్టర్ల ద్వారా చెత్తను కాపులుప్పాడకు వెళ్తోంది. అయితే తరలింపు సమయంలో రోడ్లపై చెత్త పడకుండా.. కాలుష్యం లేకుండా చూసేందుకే ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ఇందుకుగానూ జనవరి 1వ తేదీ నుంచి సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లలో జరిగిన వింతలతో ప్రాజెక్టుల వద్ద చెత్త మొత్తం గుట్టలుగుట్టలుగా పేరుకుపోయి కొండలను తలపిస్తోంది. వందల టన్నుల చెత్త పేరుకుపోతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు సాహసించడం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సీసీఎస్ ప్రాజెక్టుల అసలు ఉద్దేశాన్ని కూడా పక్కనపెట్టి పనులను అప్పగించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు ఎవరికి మేలు చేసేందుకు ఈ తతంగమంతా నడిచిందనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి ఇన్ని షరతులు విధించినప్పటికీ ఏమీ చూడకుండానే కమిషనర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఏమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయం కాస్తా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లకుండానే వ్యవహారం నడిచిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
స్కెచ్!


