అక్రమ కేసులకు భయపడేది లేదు
వైఎస్సార్‌సీపీ
యువజన విభాగం
నేడు గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన
మహారాణిపేట: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని, ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ.. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని వైఎస్సార్ సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకూటి రామచంద్రరావు, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యనిర్వహణ అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీవత్సవ్ స్పష్టం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీవత్సవ్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రశ్నించినందుకే పార్టీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెడుతోందని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే చర్య అని విమర్శించారు. ప్రజల గొంతుకను అణచివేయాలనే కుట్రలకు తమ పార్టీ భయపడదని, వెనుకడుగు వేయదని కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్ అన్నారు. శుక్రవారం జరిగే ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కాగితాల వెంకటేశ్, నియోజకవర్గ అధ్యక్షుడు తాడి రవితేజ, పార్టీ నాయకులు బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు.


