నేటి నుంచి లైట్ హౌస్ ఫెస్టివల్
మహారాణిపేట : విశాఖపట్నం వైభవాన్ని చాటిచెప్పేలా పోర్టు, షిప్పింగ్, ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో లైట్ హౌస్ ఫెస్టివల్–2026 నిర్వహించనున్నారు. ఇందుకు బీచ్‌రోడ్డులోని ఎంజీఎం పార్కు ముస్తాబవుతోంది. సముద్ర వారసత్వాన్ని ప్రోత్సహించడం, లైట్ హౌస్ టూరిజాన్ని విస్తరించడం, తీర ప్రాంత ప్రజలను భాగస్వామ్యులను చేయడం లక్ష్యంగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఫెస్టివల్‌లో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర విశేషాలతో కూడిన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 2023లో గోవా, 2024లో పూరీ నగరాల్లో లైట్ హౌస్ ఫెస్టివల్‌ను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో ఈ సారి విశాఖలో మరింత వైభవంగా నిర్వహించేందుకు పోర్టు అధికారులు, జిల్లా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. పబ్లిక్–ప్రైవేటు పార్టనర్‌షిప్(పీపీపీ) ద్వారా లైట్‌హౌస్‌ల అభివృద్ధి, భారత తీర ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.


