కింగ్
2025లో ఏకంగా 13.12 లక్షల చికెన్ బిర్యానీ ఆర్డర్లు
అర్ధరాత్రి 12 దాటాక కూడా బిర్యానీపైనే మోజు
1.47 లక్షల దోశలు, 4.3 లక్షల ఇడ్లీలు లాగించేశారు
స్నాక్స్ టైమ్‌లో రోజుకు సగటున 165 చికెన్ బర్గర్ల ఆరగింపు
స్విగ్గీ–2025 ఆర్డర్స్ నివేదికలో ఆసక్తికరమైన వివరాలు వెల్లడి
బిర్యానీయే
విశాఖపట్నం ఇప్పుడు కేవలం స్టీల్ సిటీ మాత్రమే కాదు.. రుచుల రాజధానిగానూ మారిపోయింది. ఫుడ్ లవర్స్‌కు వైజాగ్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ వెల్లడించింది. 2025లో అక్షరాలా 13 లక్షల చికెన్ బిర్యానీలు వైజాగ్ వాసుల ఆకలి తీర్చాయంటే.. ఆ రుచికి నగరం ఎంతగా దాసోహమైందో అర్థం చేసుకోవచ్చు. పల్లె రుచులైనా, పశ్చిమ దేశాల బర్గర్లైనా.. మనసు గెలుచుకోవాలంటే అది ప్లేటులోకి రావాల్సిందేనంటూ నగరవాసులు తెగ ఆర్డర్ చేశారని స్విగ్గీ విడుదల చేసిన ‘హౌ ఇండియా స్విగ్గీడ్’ నివేదిక చెబుతోంది. 2025లో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో స్విగ్గీ ద్వారా జరిగిన ఆర్డర్లకు సంబంధించి ఆసక్తికరమైన వివరాలను ఈ నివేదికలో పేర్కొంది.
ఉదయం స్వదేశీ.. సాయంత్రం విదేశీ!
నగర ప్రజలు ఉదయం వేళ సంప్రదాయ రుచులకు ప్రాధాన్యమిస్తే, సాయంత్రం వేళల్లో వెస్ట్రన్ స్నాక్స్‌పై మొగ్గు చూపారు. బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్లలో దోశ అగ్రస్థానంలో నిలిచింది. 2025లో ఏకంగా 1.47 లక్షల దోశలు ఆర్డర్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో 1.43 లక్షల ఆర్డర్లతో ఇడ్లీ నిలిచింది. ఒక్కో ఆర్డర్‌కు సగటున 3 ఇడ్లీలు అని లెక్కేసుకున్నా.. ఏకంగా 4.3 లక్షల ఇడ్లీలను నగర ప్రజలు ఆరగించేశారు. ఇక సాయంత్రం వేళల్లో ఏదైనా తినాలనిపిస్తే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది చికెన్ బర్గర్. రోజుకు సగటున 165 చికెన్ బర్గర్లు ఆర్డర్ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చికెన్ ఫ్రై, చికెన్ నగ్గెట్స్.. ఇలా ఏది చెప్పుకున్నా విశాఖ ప్రజలు మంచి టేస్ట్ ఉన్న భోజన ప్రియులని స్విగ్గీ కితాబిచ్చింది.
ఫిట్‌నెస్‌లోనూ తగ్గేదేలే!
ఆహారమే కాదు, ఆరోగ్యంపైనా నగరవాసులు శ్రద్ధ చూపారు. ఫుడ్ విషయంలో ఎలా ఆరగించారో.. ఫిట్‌నెస్ విషయంలోనూ అదే స్థాయిలో పోటీపడ్డారు. ఏడాది పొడవునా 2.12 లక్షల హై ప్రోటీన్ ఫుడ్ ఆర్డర్లు నమోదవ్వడం విశేషం. మరోవైపు ‘ఫుడ్ ఆన్ ట్రైన్’ ఫీచర్ ద్వారా నగరంలో ఆర్డర్లు ఏకంగా 171 శాతం పెరిగాయి. రైళ్లలో ప్రయాణించేవారు విశాఖ రైల్వే స్టేషన్‌కు వస్తూ.. తమ కోచ్, సీట్ నంబర్‌తో ఆర్డర్ పెట్టి మరీ ఆరగించేశారు. ఆఫీసుల్లో పనిచేసే వారు ‘డెస్క్ ఈట్స్’ ద్వారా చికెన్ పాప్‌కార్న్, ఇడ్లీ, మసాలా దోశలను ఎక్కువగా ఇష్టపడ్డారు.
ఒకేసారి 16 పిజ్జాలు.. 28 కేకులు
పార్టీలు చేసుకోవడంలోనూ వైజాగిటీస్ కొత్తదనం చాటుకుంటున్నారు. ఒకే ఆర్డర్‌లో రూ.17 వేల విలువ చేసే 16 పిజ్జాలు, 28 చాకోలావా కేక్స్ తెప్పించుకోవడం గమనార్హం. ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫ్రై ఆర్డర్ చేసుకున్నారు. చాక్లెట్ కేక్స్, మ్యాంగో రసమలాయ్, గులాబ్ జామూన్‌లకు కూడా వైజాగ్ వాసులు ఫిదా అయిపోయారు. మొత్తంగా విశాఖ అంటే.. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ అనుకుంటివా..‘సిటీ ఆఫ్ ఫుడీస్’అని పుష్ప స్టైల్‌లో డైలాగ్స్ చెబుతున్నారంటూ స్విగ్గీ నివేదిక చమత్కరించింది.
వైజాగ్ వాసులు.. బిర్యానీ ప్రియులు
ఉదయం పూట వేడి వేడి దోశల పలకరింపు.. మధ్యాహ్నం వేళ ముచ్చటైన బిర్యానీ విందు.. సాయంత్రం చిరుజల్లులో చికెన్ బర్గర్ల సందడి.. అర్ధరాత్రి ఆకలికి మళ్లీ చికెన్ బిర్యానీ! సాగర కెరటాల హోరుకు, స్పైసీ బిర్యానీ హుషారు తోడైతే ఆ మజాయే వేరంటూ విశాఖ వాసులు ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
– సాక్షి, విశాఖపట్నం
చికెన్ బిర్యానీ భళా
2025 ఏడాదికి సంబంధించి స్విగ్గీ నివేదిక ప్రకారం.. వైజాగ్ వాసులు తిండి విషయంలో కొత్త రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా చికెన్ బిర్యానీ పట్ల తమకున్న అంతులేని మమకారాన్ని 13.12 లక్షల ఆర్డర్లతో చాటిచెప్పారు. ఏడాది పొడవునా ఈ స్థాయి ఆర్డర్లు నమోదయ్యాయి. విశేషమేమిటంటే.. అర్ధరాత్రి తర్వాతే ఎక్కువ మంది బిర్యానీ తినడానికి ఇష్టపడ్డారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య చికెన్ బిర్యానీ ఆర్డర్లు ఏకంగా 48 శాతం పెరిగాయి. 2024తో పోలిస్తే డిన్నర్ ఆర్డర్లలో 23 శాతం వృద్ధి నమోదైంది.


