డీఆర్సీకి నివేదికలతో రండి
మహారాణిపేట: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సమీక్షించారు. శుక్రవారం డీఆర్సీ సమావేశం జరగనున్న నేపథ్యంలో.. గురువారం కలెక్టరేట్‌లో అన్ని శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గత డీఆర్సీలో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. ముఖ్యంగా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవోల అమలు, సాధించిన లక్ష్యాలపై చర్చించారు. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, రెవెన్యూ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న పథకాల తాజా స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యాంశాలను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీఆర్సీ సమావేశానికి పక్కా నివేదికలను రూపొందించాలని, ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమీక్షలో జేసీ కె.మయూర్ అశోక్, ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


