తప్పులు.. రైతులకు తిప్పలు
మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా పంపిణీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు తప్పుల తడకగా ఉన్నాయి. పుస్తకాల్లో పేర్లు, సర్వే నంబర్లు తారుమారయ్యాయి. వయసు, భూమి వివరాల్లోనూ అనేక వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్ డేటా అప్డేట్ కాకపోవడంతో అంతా గందరగోళంగా తయారైంది. తాజా క్రయ, విక్రయాలు (రిజిస్ట్రేషన్లు) ఈ పుస్తకాల్లో నమోదు కాకపోవడంతో భూ యజమానులు లబోదిబోమంటున్నారు.
ఇంకా పూర్తి కాని పంపిణీ
భూ యాజమాన్య హక్కు పత్రాలు పంపిణీకి ప్రభుత్వం ఈ నెల 2వ తేదీ నుంచి శ్రీకారం చుట్టింది. కలెక్టర్, జేసీ పర్యవేక్షణలో తహసీల్దార్లు ఈ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 37 గ్రామాల్లో రీ–సర్వే పూర్తి కాగా, సుమారు 16 వేల పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి గ్రామ సభల ద్వారా రైతులకు, ప్రజలకు నేరుగా అందజేయాలని నిర్ణయించారు. అయితే పుస్తకాల్లో కోకొల్లలుగా తప్పులు ఉండడంతో పంపిణీ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు.
జాప్యంపై అసహనం
సాధారణంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 45 పని దినాల్లోగా పాసు పుస్తకాలు మంజూరు చేయాలనే నిబంధన ఉంది. అయితే భూ యజమానులకు పోస్ట్‌లో పాస్ బుక్ చేరడానికి 100 రోజులు పట్టేది. దరఖాస్తు చేసిన ఏడాది తర్వాత కూడా పుస్తకాలు అందక అనేక మంది అవస్థలు పడుతున్నారు. జిల్లాలో రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది.
చక్కదిద్దే పనిలో రెవెన్యూ యంత్రాంగం
రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో సిద్ధం చేసిన పుస్తకాలు తప్పుల తడకగా రావడంతో, వాటిని చక్కదిద్దే పనికి రెవెన్యూ యంత్రాంగం ఉపక్రమించింది. భూముల విస్తీర్ణంలో చోటు చేసుకున్న వ్యత్యాసాలు సరిచేయాలంటూ చాలా దరఖాస్తులు వచ్చాయి. దీంతో అధికారులు వాటిని సరిదిద్దే పనిలో పడ్డారు. క్రయ విక్రయాలు, భాగస్వామ్య పంపిణీ, గిఫ్ట్ డీడ్‌లు, మ్యూటేషన్ వంటివి పూర్తయిన తర్వాతే పట్టాదారు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని, అప్పుడే మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
పాసు పుస్తకంలో గొంతిన వెంకట రమణ పేరు ఆంగ్లంలో తప్పుగా నమోదు
జెట్టపురెడ్డితునికి బదులు జత్తపురెడ్డి తునిగా పడిన పాసు పుస్తకం, ఆధార్, సెల్ నంబర్లు కూడా తప్పులే..
పుస్తకాల నిండా తప్పులే..
పట్టాదారు పాస్ పుస్తకాల్లోని భూమి వివరాలు, సర్వే నంబర్లు, భూ యజమానుల వివరాల్లో అనేక తప్పులు దొర్లాయి. భూముల అమ్మకాలు జరిగినా, కొత్త యజమానుల పేర్లు పాస్ పుస్తకాల్లో మారలేదని పలువురు వాపోతున్నారు. తప్పులు ఉన్న విషయం తెలియక అనేక మంది వాటిని తీసుకున్న తర్వాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రింటింగ్‌లోనూ అనేక తప్పులు కనిపిస్తున్నాయి. చిరునామాలు, పేర్లలో అక్షర దోషాలు, వయసులో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పేర్లు కూడా మారిపోయాయి. ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ పుస్తకాలే ప్రామాణికం కాబట్టి, భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భూ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పుస్తకంలో అన్నీ తప్పులే..
పట్టాదారు పాసు పుస్తకం కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. పుస్తకాలు వచ్చాయని సంతోషపడ్డాం. కానీ నాకు ఇచ్చిన పుస్తకంలో అనేక తప్పులు ఉన్నాయి. ఈ విషయాన్ని స్థానిక వీఆర్‌వో ద్వారా తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లాను. పాసు పుస్తకంలో తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతాం. అందుకే వెంటనే సవరించాలని కోరాను. – చిల్లా వెంకటరమణ, వెల్లంకి, ఆనందపురం మండలం
తప్పులు సరిచేసి ఇస్తామన్నారు
నాకు భీమిలి మండలంలో 35 సెంట్ల భూమి ఉంది. ఈ భూమికి తాజాగా పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారు. అయితే అందులో తప్పులు ఉన్నాయి. దీన్ని సరిచేయాలని తహసీల్దార్‌ను కోరాను. తప్పులు సరిచేసి, కొత్త పుస్తకం ఇస్తామని ఆయన చెప్పారు.
– పిన్నంటి అప్పలసూరి, మజ్జివలస, భీమిలి మండలం
తప్పులు.. రైతులకు తిప్పలు
తప్పులు.. రైతులకు తిప్పలు
తప్పులు.. రైతులకు తిప్పలు


