అదృశ్యం డ్రామా ఆడి.. అడ్డంగా దొరికిపోయి..
తాళి కట్టిన భర్తనే కడతేర్చిన భార్య
ప్రియుడి మోజులో
రూ.50 వేలు సుపారీ ఇచ్చి స్కెచ్
నాగరాజు హత్య కేసులో వీడిన మిస్టరీ
భార్య, ప్రియుడు సహా నలుగురి అరెస్ట్
పీఎంపాలెం: ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించింది భార్య. ఎంత తెలివిగా నేరం చేసినా చట్టం నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ కేసులో ఆమెతో పాటు ప్రియుడు, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాఖ నార్త్ ఏసీపీ అప్పలరాజు ఈ కేసు వివరాలను వెల్లడించారు.
అసలేం జరిగింది? : విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరుకు చెందిన అల్లాడ నాగరాజు(38)కు, అదే ప్రాంతానికి చెందిన తన మేనత్త కూతురైన రమ్యతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం విశాఖకు వలస వచ్చిన వీరు కే–3 కాలనీలో ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. నాగరాజు జీవీఎంసీ 8వ వార్డులోని పనోరమా హిల్స్ వాటర్ పంపింగ్ విభాగంలో పనిచేస్తుండేవాడు. అక్కడే పనిచేసే కంచరపాలేనికి చెందిన సంజీవి వసంతరావుతో నాగరాజుకు పరిచయం ఏర్పడింది.
ప్రియుడితో కలిసి కుట్ర : స్నేహం సాకుతో వసంతరావు తరచూ నాగరాజు ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో నాగరాజు భార్య రమ్యతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వసంతరావు భార్య గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో నాగరాజును అడ్డు తొలగించుకుంటే స్వేచ్ఛగా ఉండవచ్చని వీరిద్దరూ పథకం వేశారు. ఇందుకోసం కంచరపాలేనికి చెందిన బాలకృష్ణ, ప్రవీణ్ అలియాస్ పండులకు రూ.50 వేలు సుపారీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
మద్యం తాగించి.. దారుణ హత్య : పథకం ప్రకారం గత ఏడాది నవంబర్ 28న వుడా కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. నాగరాజుకు మద్యం వ్యసనం ఉంది. 29వ తేదీ సాయంత్రం మందు పార్టీ పేరుతో నాగరాజును అక్కడికి తీసుకెళ్లి ఫుల్లుగా మద్యం తాగించారు. అనంతరం వసంతరావు, బాలకృష్ణ, ప్రవీణ్ కలిసి నాగరాజు గొంతు నులిమి, ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి తిమ్మాపురం రోడ్డులోని బావికొండ సమీపంలో ఉన్న పొదల్లో పడేసి, అతను మద్యం మత్తులో పడిపోయినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
అదృశ్యమైనట్లు డ్రామా : భర్తను హత్య చేసిన తర్వాత రమ్య ఏమీ ఎరగనట్లు నటించింది. ప్రియుడితో కలిసి ఆనందంలో మునిగితేలింది. భర్త అదృశ్యం అయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇక అతని కథ ముగిసినట్టే అని భావించింది. ఆ తర్వాత కే–3 కాలనీ నుంచి బక్కన్నపాలేనికి మకాం మార్చింది. డిసెంబర్ 9న నాగరాజు 10 తులాల బంగారం, రూ.5 వేల నగదుతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని, తిరిగి రాలేదని పేర్కొంటూ డిసెంబరు 17న పీఎంపాలెం పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసింది. నాగరాజు అదృశ్యంపై అనుమానం వచ్చిన అతని బంధువులు రమ్య, వసంతరావులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అస లు విషయం బయటపడింది. సుమారు 40 రోజుల కిందట హత్య చేయడంతో మృతదేహం పూర్తిగా పాడైపోయిన స్థితిలో ఈ నెల 7న పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. హత్యకు సూత్రధారి అయిన రమ్యతో పాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పీఎంపాలెం సీఐని, సిబ్బందిని సీపీ, డీసీపీ అభినందించారు.
అదృశ్యం డ్రామా ఆడి.. అడ్డంగా దొరికిపోయి..


