వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే గేమ్ లక్ష్యం
విశాఖ సిటీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమలే కీలకమని గ్లోబల్ అలయన్స్ ఫర్ మాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్(గేమ్) వైజాగ్ డిస్ట్రిక్ట్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ మిషన్(డీఈఎం) ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.సుభాష్‌కిరణ్ తెలిపారు. గురువారం ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే గేమ్ లక్ష్యమన్నారు. విశాఖ కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి గతేడాది సెప్టెంబర్‌లో గేమ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని చెప్పారు.
విశాఖలో ఆరు ప్రాజెక్టులకు శ్రీకారం
విశాఖలో కమ్యూనిటీ టూరిజం, రైతు పంటల ఎగుమతులు, ఆక్వా రంగంలో మహిళలకు సహకారం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్‌ఎంఈలకు మెంటర్‌షిప్ ప్రోగ్రాం, వెజిటేబుల్ క్లస్టర్ ఇలా ఆరు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పాడేరు, అరకు ప్రాంతాల్లో కమ్యూనిటీ టూరిజం అభివృద్ధి కోసం ఐదు గ్రామాలను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కిల్లోగూడలో హోం స్టేలు, కమ్యూనిటీ కిచెన్, ఇలా పర్యాటకులకు అవసరమైన అన్ని లాజిస్టిక్స్ ఉండేలా స్థానికులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీవో)ల ద్వారా రైతులను వ్యాపారవేత్తలుగా, విదేశాలకు కాఫీ, పసుపు, మిల్లెట్స్ ఇలా.. అన్నింటినీ ఎగుమతి చేసేలా శిక్షణ ఇస్తున్నామని వివరించారు. అరకు కాపీని యూరప్‌కు ఎగుమతి చేసేందుకు వీలుగా యూరోపియన్ యూనియన్ డిఫారెస్టేషన్ రెగ్యులేషన్(ఈయూడీఆర్) సర్టిఫికేషన్ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ సమావేశంలో గేమ్ సహ వ్యవస్థాపకుడు రవి వెంకటేషన్, గేమ్ అధ్యక్షుడు కేతుల్ ఆచార్య, ఆర్టీఐహెచ్ సీఈవో రవి ఈశ్వరరాపు పాల్గొన్నారు.


