సామాన్యురాలి చేతుల మీదుగా.. అసామాన్యురాలి కథ
పారిశుధ్య కార్మికురాలి చేతుల మీదుగా
రాష్ట్రపతి పుస్తకావిష్కరణ
మద్దిలపాలెం: సంప్రదాయాలకు భిన్నంగా ఆంధ్రా విశ్వవిద్యాలయంలో గురువారం ఓ అరుదైన కార్యక్రమం జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవిత విశేషాలతో ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము’ పుస్తకాన్ని.. ఏయూలో రోడ్లు శుభ్రం చేసే పారిశుధ్య కార్మికురాలు లక్ష్మమ్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఏయూ ప్రాంగణంలోని ఒక చెట్టు కింద అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ వేడుక శ్రమ గౌరవానికి, సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా రచయిత యార్లగడ్డ మాట్లాడుతూ.. కష్టసాధ్యమైన పరిస్థితుల నుంచి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన ముర్ము జీవితం అణగారిన వర్గాలకు గొప్ప ప్రేరణ అన్నారు. ఆమెలోని వినయం, పట్టుదల, శ్రమకు గౌరవం దక్కాలనే ఉద్దేశంతోనే.. ఒక సామాన్య కార్మికురాలితో ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశామని తెలిపారు. అనంతరం పుస్తక తొలి ప్రతిని వేములపల్లి విద్యాసాగర్‌కు అందజేశారు. ద్రౌపది ముర్ము జీవితాన్ని ప్రతిబింబించేలా సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమం అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది.


