మొబైల్ టాయిలెట్ల బిల్లుల రచ్చ
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం అధికారుల నిర్లక్ష్య వైఖరిపై వేదికగా మారింది. శుక్రవారం ప్రధాన కార్యాలయంలో మేయర్, స్థాయీ సంఘ చైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి పలువురు కీలక అధికారులు డుమ్మా కొట్టడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థాయీ సంఘమంటే అధికారులకు చులకనగా మారిందని, కనీస సమాచారం లేకుండా గైర్హాజరవ్వడం సరికాదని మండిపడ్డారు.
సీఎంహెచ్‌వో ఎక్కడ?
గతేడాది యోగా డే సందర్భంగా ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్ల నిర్వహణకు రూ.1.62 కోట్లు చెల్లించాలన్న ప్రతిపాదన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని గత సమావేశంలోనే సీఎంహెచ్‌వో డాక్టర్ నరేష్‌కుమార్‌ను సభ్యులు ఆదేశించారు. నెల రోజులు గడుస్తున్నా వివరణ ఇవ్వకపోగా, సదరు అధికారి శుక్రవారం జరిగిన సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో వివరణ లేకుండా పాత అంశాలనే అజెండాలో ఎలా చేర్చుతారని సభ్యులు ప్రశ్నించారు. వివరణ ఇవ్వాల్సిన అధికారే లేనప్పుడు చర్చ ఎలా సాధ్యమని సభ్యులు పట్టుబట్టడంతో, సీఎంహెచ్‌వో పరిధిలోని సుమారు 25 అంశాలను మేయర్ వాయిదా వేశారు. మరో అంశంపై చర్చ సందర్భంగా.. సంబంధిత అధికారి తనకు బదులుగా సమాధానం చెప్పలేని ఒక మహిళా ఉద్యోగిని పంపడంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. స్థాయీ సంఘాన్ని ఎగతాళి చేస్తున్నారా అని ప్రశ్నించారు. కమిషనర్‌తో మీటింగ్‌లో ఉన్నానంటూ సదరు అధికారి చెప్పడం, సమావేశం చివర్లో రావడాన్ని తప్పుబట్టారు.
శిలాఫలకాలపై పేర్లు ఉండాల్సిందే..
నియోజకవర్గాల వారీగా జోనల్ కార్యాలయాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే శిలాఫలకాలపై కేవలం ఆ వార్డు కార్పొరేటర్ పేరు మాత్రమే కాకుండా, జోన్ పరిధిలోని కార్పొరేటర్లందరి పేర్లు ఉండాలని సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మేయర్.. పాతవి తొలగించి కొత్త శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మొత్తం 139 అంశాలు (87 ప్రధాన, 52 టేబుల్ అజెండా) చర్చకు రాగా, 30 అంశాలను వాయిదా వేసి మిగిలిన వాటికి ఆమోదం తెలిపారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి రూ.26.46 కోట్ల పనులకు పచ్చజెండా ఊపారు. పారిశుధ్య సిబ్బంది, ఇతర జీవీఎంసీ సిబ్బందికి జీతాలు సకాలంలో ఇవ్వాలని చైర్మన్ సూచించారు. వార్డులో వీధి దీపాల సమస్య ఉందని సభ్యురాలు సాడి పద్మారెడ్డి మేయర్ దృష్టికి తీసుకెళ్లగా.. 24 గంటల్లో ఆ వీధిలో లైట్లు వెలిగేలా చూడాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. రాత్రివేళ బీచ్‌రోడ్డులో పాటు నగరంలోని ప్రధాన జంక్షన్లలో పారిశుధ్య నిర్వహణ లోపాలను సరిచేసి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సభ్యులు సేనాపతి వసంత, మొల్లి హేమలత, ముత్యాలు, గంకల కవిత, రాపర్తి త్రివేణి వరప్రసాదరావు, దాడి వెంకటేశ్వరరావు, గేదెల లావణ్య, మాదంశెట్టి చిన్నతల్లి, కొణతాల నీలిమ తదితరులు పాల్గొన్నారు.


