సురక్షిత విశాఖే లక్ష్యం
బీచ్‌రోడ్డు: ‘సురక్షిత తీరం–సురక్షిత విశాఖ’లో భాగంగా నగరాన్ని ప్రజలకు, పర్యాటకులకు అత్యంత భద్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నగర పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆర్.కె.బీచ్ వద్ద అత్యాధునిక రిమోట్ కంట్రోల్డ్ లైఫ్ బాయ్‌ల పనితీరును నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. సముద్రంలో ప్రమాదవశాత్తు మునిగిపోయే వారిని రక్షించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భీమిలి నుంచి అప్పికొండ వరకు ఉన్న తీరప్రాంతాన్ని పరిశీలించి 16 ప్రమాదకర పాయింట్లను గుర్తించామన్నారు. గతంలో ఈ ప్రాంతాల్లో సముద్ర స్నానాలకు వెళ్లి పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఆయా 16 పాయింట్ల వద్ద ఈ రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు హెచ్చరిక బోర్డులు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, పోలీస్ సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో నియమిస్తామన్నారు. పర్యాటకులు ప్రమాదకర లోతుల్లోకి వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని, ఒకవేళ ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే తక్షణం ఈ లైఫ్ బాయ్‌లను పంపించి రక్షిస్తామని వివరించారు. విశాఖ తీరాన్ని అత్యంత సురక్షిత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడమే నూతన సంవత్సరంలో తమ ప్రథమ లక్ష్యమని సీపీ పేర్కొన్నారు. డీసీపీ–1 మణికంఠ చెందోలు, ఏడీసీపీ(ఏఆర్), ఈస్ట్ ఏసీపీ, ఇతర పోలీస్ అధికారులు, లైఫ్ బాయ్ సంస్థ ప్రతినిధులు, లైఫ్ గార్డులు పాల్గొన్నారు.
సీపీ శంఖబ్రత బాగ్చి


