ఏలేరు కాలువలో పడి వ్యక్తి మృతి
ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌కు నీరు సరఫరా చేసే ఏలేరు కాలువలో శుక్రవారం ఉదయం అగనంపూడికు చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు. స్టీల్‌ప్లాంట్ పోలీసులు అందించిన వివరాలివి.. అగనంపూడికు చెందిన మామిడి పైడిరాజు (55) తాపీ పనులు చేస్తూ కొడుకు, కోడలు వద్ద ఉంటున్నాడు. ఉదయం ఏలేరు కాలువ వద్ద కాలకృత్యాల కోసం వెళ్లిన పైడిరాజు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతకసాగారు. ఈలోగా కాలువలో మృతదేహం బయటపడటంతో స్టీల్‌ప్లాంట్ పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారం తెలిసి పైడిరాజు కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని గుర్తు పట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత కేజీహెచ్‌కు తరలించారు. ఏఎస్‌ఐ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


