కమ్యూనిస్ట్ భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్లాలి
ఏయూ క్యాంపస్: కమ్యూనిస్ట్, సోషలిస్టు భావజాలాన్ని విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రముఖ తమిళ యువ దర్శకుడు, రచయిత రాజు మురుగన్ ఉద్ఘాటించారు. సీఐటీయూ జాతీయ మహాసభల సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వారం రోజులుగా జరుగుతున్న ‘శ్రామిక ఉత్సవ్’ శుక్రవారం రాత్రి ముగిసింది. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. వర్గ పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కళలకు ఎల్లలు లేవన్నారు. వీధి నాటిక వైతాళికుడు సఫ్దర్ హష్మీని భౌతికంగా అంతమొందించినా.. ఆయన వీధి నాటిక సహా ఇతర కళారూపాలేవీ కనుమరుగు కాలేదని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తున్న సీఐటీయూను ఈ సందర్భంగా అభినందించారు. పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో ఇక్కడ ఎన్నో ఉద్యమాలు జరిగిన విషయం తనకు తెలుసన్నారు. సభ ప్రారంభానికి ముందు సఫ్దర్ హష్మీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రాజు మురుగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. మరొక అతిథి, యువ దర్శకుడు అట్టాడ సృజన్ మాట్లాడుతూ.. జీవన శైలిలో కమ్యూనిస్ట్ పద్ధతులను అలవాటు చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. నేటి కాలంలో సాధారణ జీవనం సైతం ఓ పోరాటంగా మారిందన్నారు. సినిమా అత్యంత శక్తిమంతమైన మీడియా అని, పార్వతీపురం కుట్ర కేసు కథాంశంగా సినిమా తీయాలన్నది తన ఆకాంక్ష అని వెల్లడించారు. సభకు అధ్యక్షత వహించిన సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ‘ఆహార్యం, ఆరోగ్యం, విద్య, ఉపాధి హక్కులకై ఉద్యమిద్దాం’ అనే ఇతివృత్తంతో శుక్రవారం కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్, శ్రామిక ఉత్సవ్ కన్వీనర్ రమాప్రభ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ముజఫర్ అహ్మద్ స్వాగతం పలికారు. ఏడు రోజుల పాటు నిర్వహించిన వివిధ ఎగ్జిబిషన్ల కన్వీనర్లను ఈ సందర్భంగా అభినందించారు. చివరగా సీఐటీయూ నాయకుడు కుమారమంగళం వందన సమర్పణ చేశారు.


