విశాఖ ఉక్కు.. భారతీయుల హక్కు
మెడకు ఉరితాళ్లతో ఐద్వా వినూత్న నిరసన
బీచ్‌రోడ్డు: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను తక్షణం విరమించుకోవాలని, ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉన్న స్టీల్ ప్లాంట్ దీక్ష శిబిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. మోదీ ప్రభుత్వ విధానాలు స్టీల్ ప్లాంట్ కార్మికులు, ప్రభుత్వ రంగ పరిశ్రమల మెడకు ఉరితాళ్లుగా మారాయని నినదించారు. ఈ మేరకు మహిళలు తమ మెడలకు ఉరితాళ్లను తగిలించుకొని నిరసన తెలిపారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వేతన బకాయిలను తక్షణం చెల్లించాలని, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఆల్ ఇండియా కార్యదర్శి సింధు, కేరళ మాజీ కార్మిక శాఖ మంత్రి మెర్సీ కుట్టియమ్మ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కూటమి నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మహిళలు, కార్మికులు ఐదేళ్లుగా చేస్తున్న పోరాట ఫలితంగానే స్టీల్ ప్లాంట్‌ను ఇంతవరకు కాపాడుకోగలిగామన్నారు. ‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ మాత్రమే కాదని, అది ‘భారతీయుల హక్కు’అని స్పష్టం చేశారు. ప్రైవేటీకరించిన ఎయిర్ ఇండియా వంటి సంస్థల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నామని, దేశ రక్షణకు, సంపదకు కీలకమైన ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటుపరం చేస్తే దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ పరిరక్షణ కోసం ఐదేళ్లుగా పోరాడటం, అందులో మహిళలు పెద్ద ఎత్తున భాగస్వాములవడం చాలా గొప్ప విషయమని, దేశవ్యాప్తంగా శ్రామిక మహిళలకు ఈ పోరాటాలు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని, కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగించే లేబర్ కోడ్స్‌ను తక్షణం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాధవి, వై.సత్యవతి, జిల్లా నాయకులు బి.పద్మ తదితరులు పాల్గొన్నారు.


