రసాయన ట్యాంకర్ ఇంజిన్‌లో మంటలు
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ, బోయిపాలెం కూడలిలో శనివారం సాయంత్రం ఓ రసాయన ట్యాంకర్ ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మీథైల్ ఆల్కహాల్ లోడుతో వెళ్తున్న ఈ ట్యాంకర్ కేబిన్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే చిట్టివలస అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, ట్యాంకుకు మంటలు వ్యాపించకుండా ఫోమ్‌తో ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక శాఖాధికారి జి.శ్రీనివాసరాజు తెలిపిన వివరాలివి. అనకాపల్లికి చెందిన వై.సాయికుమార్‌కు చెందిన ట్యాంకర్, విశాఖ నుంచి మీథైల్ ఆల్కహాల్ లోడుతో జాతీయ రహదారి మీదుగా ఆనందపురం వైపు వెళ్తోంది. బోయిపాలెం జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఇంజిన్‌లో మంటలు వ్యాపించి, క్షణాల్లో కేబిన్ కాలి బూడిదైంది. అప్పటికే డ్రైవర్, క్లీనర్ దిగిపోయారు. అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి వెనుక ఉన్న కెమికల్ ట్యాంకుకు మంటలు అంటుకోకుండా నివారించగలిగారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను అర గంటకు పైగా నిలిపివేసి, ఆనందపురం పోలీసుల సాయంతో వాహనాలను సర్వీస్ రోడ్డు మీదుగా మళ్లించారు. ఈ ప్రమాదంలో కాలిపోయిన కేబిన్, ఇంజిన్ విలువ సుమారు రూ.9లక్షలు ఉంటుందని అధికారి శ్రీనివాసరాజు తెలిపారు. మంటలు అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
తప్పిన పెను ప్రమాదం
రసాయన ట్యాంకర్ ఇంజిన్‌లో మంటలు


