కొత్త సంస్కృతికి తెరలేపుతున్న టీడీపీ?
ఆరిలోవ: జీవీఎంసీ 13వ వార్డు పరిధిలోని దుర్గాబజార్ వద్ద ఉన్న వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మను ధ్వంసం చేసేందుకు శనివారం ఓ వ్యక్తి విఫలయత్నం చేశాడు. దీన్ని గమనించిన స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకోవడంతో అతను వెనుదిరిగారు. వార్డులోని దుర్గాబజార్ రామాలయం వద్ద రోడ్డు పక్కన కొన్నేళ్లుగా వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మ ఉంది. సందర్భాన్ని బట్టి ఇక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తుంటారు. ఇందులో భాగంగా ఈ నెల 21న పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నాయకులు ఇక్కడ జెండాను ఆవిష్కరించారు. అయితే, శనివారం ఓ వ్యక్తి ఆ దిమ్మను పాక్షికంగా ధ్వంసం చేశాడు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు అతడిని అడ్డుకుని నిలదీశారు. స్థానిక టీడీపీ నాయకుడి సూచన మేరకే తాను తొలగిస్తున్నానని ఆ వ్యక్తి చెప్పడంతో.. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆ టీడీపీ నాయకుడిని ప్రశ్నించారు. దీంతో ఆ టీడీపీ నాయకుడు మాట మారుస్తూ.. వార్డు కార్పొరేటర్ భర్త తొలగించమన్నారని సమాధానం ఇచ్చారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. రెండు నెలల కిందట కూడా ఇదే వార్డులోని ఆరిలోవ ఆఖరి బస్టాప్ వద్ద ఉన్న వైఎస్సార్ సీపీ జెండా దిమ్మను.. స్థానిక టీడీపీ నాయకుల సూచనలతో జీవీఎంసీ సిబ్బంది తొలగించారు. అప్పట్లో వైఎస్సార్‌సీపీ నాయకులు సిబ్బందిని నిలదీసి, ఆ దిమ్మను తిరిగి అక్కడ ఏర్పాటు చేయించారు. ఇలా వార్డులో టీడీపీ నాయకులు కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఈ ప్రాంతంలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తుండటంపై స్థానికులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మ
ధ్వంసానికి విఫలయత్నం


