ట్రాన్స్‌పర్సన్స్ గౌరవం, బాధ్యత పోలీసులదే..
అల్లిపురం: మిషన్ జ్యోతిర్గమయలో భాగంగా ట్రాన్స్‌పర్సన్స్‌కు గౌరవప్రదమైన జీవనం అందించే దిశగా విశాఖ సిటీ పోలీసులు కృషి చేయడం అభినందనీయమని మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శనివారం జరిగిన ట్రాన్స్‌పర్సన్స్‌కు ఉపాధి కల్పనలో భాగంగా నిర్వహించిన నియామక పత్రాల పంపిణీలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన, వివాహాలు ఇతర శుభకార్యాల సమయంలో తలెత్తుతున్న సమస్యలు, బీచ్‌లు, రైళ్లు, బస్ స్టాండ్‌ల వంటి ప్రదేశాల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలు, కొన్ని చోట్ల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ గమనించి, ఈ సమస్యలను శిక్షాత్మక దృష్టితో కాకుండా మానవతా దృష్టితో పరిశీలించారు. గత మే 10న ట్రాన్స్‌పర్సన్స్‌తో అవగాహన సమావేశంలో సుమారు 160 మంది ట్రాన్స్‌పర్సన్స్ పాల్గొని సామాజిక వివక్ష, ఆరోగ్య సమస్యలు, ఉపాధి అవకాశాల కొరత, భద్రత వంటి సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా కమిషనర్ ట్రాన్స్‌పర్సన్స్ గౌరవం, భద్రత పోలీసుల బాధ్యత అని భరోసా ఇచ్చి, భిక్షాటన పరిష్కారం కాదని, ఉపాధి, స్వావలంబన ద్వారానే శాశ్వత మార్పు సాధ్యమని స్పష్టం చేశారు. బ్యాంకుల సహకారంతో ముద్రా రుణాలు మంజూరు చేయడం, ఆరుగురు ట్రాన్స్‌పర్సన్స్‌కు ఐరన్ కియోస్కులు ఏర్పాటు చేసి స్వయం ఉపాధికి ప్రోత్సాహం ఇవ్వడం, అలాగే జీవీఎంసీ ద్వారా 20 మంది ట్రాన్స్‌పర్సన్స్‌కు పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ పీలా శ్రీనివాస్‌కు, మెడికల్ ఆఫీసర్‌కు, ఎస్‌బీఐ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ట్రాన్స్‌పర్సన్స్ ఆనందం, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ నగర పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.


