నిరుద్యోగ భృతి చెల్లించాలి
ఏయూ ఆర్చ్ వద్ద ఏఐవైఎఫ్ భిక్షాటన
మద్దిలపాలెం: ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని, జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లతో శనివారం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఆర్చ్ వద్ద ఫెడరేషన్ నాయకులు వినూత్నంగా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కెంగువ అచ్యుతరావు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వడానికి నిధులు లేవని చెబుతున్న సీఎం చంద్రబాబు.. ఆవకాయ్ ఫెస్టివల్‌కు రూ.5 కోట్లు, సోషల్ మీడియా ప్రచారానికి వేల కోట్లు ఖర్చు చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం, ఈ 19 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఎస్సీ, బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు నేటికీ రుణాలు మంజూరు కాలేదన్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించిన స్వయం ఉపాధి పథకం రుణాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బీసీ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని, లేని పక్షంలో జనవరిలో యువతను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నిరసనలో ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు మధు రెడ్డి, కెల్లా రమణ, రాజు, మురళి, లక్ష్మణ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


