సిరుల ట్యూనా.. దళారులకేనా? | - | Sakshi
Sakshi News home page

సిరుల ట్యూనా.. దళారులకేనా?

Dec 26 2025 9:47 AM | Updated on Dec 26 2025 9:47 AM

సిరుల

సిరుల ట్యూనా.. దళారులకేనా?

రోజుకు 200 టన్నుల వరకు వలకు చిక్కుతున్న చేపలు

కేరళతో పాటు వియత్నాం, థాయ్‌లాండ్‌ తదితర దేశాల్లో భారీ డిమాండ్‌

కిలో రూ.120 నుంచి రూ.180కే కొనుగోలు చేస్తున్న దళారులు

విదేశీ మార్కెట్‌లో కిలో రూ.350 నుంచి రూ.800 పైగా ధర

మార్కెటింగ్‌, ప్రాసెసింగ్‌ సౌకర్యం లేక నష్టపోతున్న మత్స్యకారులు

సాక్షి, విశాఖపట్నం: వలకు చిక్కితే సిరులు కురిపిస్తుంది.. తింటే పుష్కలంగా ఆరోగ్యాన్ని అందిస్తుంది.. ఎగుమతి చేస్తున్నామంటే చాలు, కొనుగోలు చేసేందుకు విదేశాలు క్యూ కడతాయి. అలాంటి అపారమైన మత్స్య సంపద తూర్పు తీరానికి సొంతం. ఆరోగ్య ప్రయోజనాలు, ఎగుమతి డిమాండ్‌ పరంగా అంతా సానుకూలంగా ఉన్నా.. సిరులు కురిపించే విషయంలో మాత్రం మత్స్యకారులకు అన్యాయమే జరుగుతోంది, వారి శ్రమ దోపిడీకి గురవుతోంది. వందల కిలోమీటర్ల దూరం వెళ్లి, గంటల తరబడి వేచి చూస్తే గానీ చిక్కని ట్యూనా చేపలకు సరైన మార్కెటింగ్‌ సౌకర్యాలు లేకపోవడంతో దళారులకే లబ్ధి చేకూరుతోంది. జాతీయ మత్స్య పరిశోధన సంస్థ(ఎఫ్‌ఎస్‌ఐ) సర్వే ప్రకారం.. ఇక్కడి నుంచే ట్యూనా అత్యధికంగా ఎగుమతి అవుతున్నా, గంగపుత్రులకు మాత్రం ఆశించిన లాభం చేకూరడం లేదు.

అపారమైన సంపద

ఎఫ్‌ఎస్‌ఐ విశాఖ జోన్‌ ఇన్‌చార్జి సి.ధనుంజయరావు నేతృత్వంలో శాస్త్రవేత్త జి.వి.ఎ.ప్రసాద్‌ ట్యూనా సంపదపై సుదీర్ఘ పరిశోధనలు నిర్వహించారు. 2024 అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ వరకు విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌, పెదజాలారిపేట, పూడిమడక, కాకినాడ కేంద్రాలుగా లభ్యమైన సముద్ర ఉత్పత్తులపై సర్వే చేసిన సమయంలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. విదేశీయులకు అత్యంత ఇష్టమైన, డిమాండ్‌ ఉన్న ట్యూనా చేపలు ఎక్కువ శాతం ఇక్కడే లభ్యమవుతున్నట్లు తేలింది. తూర్పు ఎగువ తీరంలో ట్యూనా చేపల దిగుబడి అధికంగా ఉన్నట్లు గుర్తించారు. విశాఖపట్నం, కాకినాడ తీరాల్లో మత్స్యకారులు జరిపే వేటలో 50 నుంచి 60 రకాల చేపలు లభ్యమైతే.. వాటిల్లో ట్యూనాల వాటా 50 శాతానికి పైగా ఉంటోందంటే.. ఇక్కడ వీటి దిగుబడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎల్లో ఫిన్‌ ట్యూనా(పసుపురెక్కల సూర), బిగ్‌ ఐ ట్యూనా(పెద్దకన్ను సూర), స్కిప్‌జాక్‌ ట్యూనా (నామాల సూర) తదితర రకాలు విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌కు రోజుకు 100 నుంచి 120 టన్నుల వరకు వస్తున్నాయి. కాకినాడ తీరంలోనూ 100 టన్నుల వరకు లభ్యత ఉన్నట్లు ఎఫ్‌ఎస్‌ఐ శాస్త్రవేత్త ప్రసాద్‌ సర్వేలో స్పష్టమైంది.

శ్రమకు తగిన ధర ఎక్కడ?

ఇంత కష్టపడి రోజుల తరబడి సముద్రంలో వేటాడి వస్తే.. ట్యూనా విషయంలో మాత్రం మత్స్యకారులకు ఆశించిన రాబడి రావడం లేదు. స్థానిక ప్రజలు ట్యూనాను తినేందుకు అంతగా ఆసక్తి చూపించరు. దీంతో లోకల్‌ మార్కెట్‌లో గిరాకీ ఉండదు. ఇక చేసేది లేక.. దళారులు ఎంత ధర ఇస్తామంటే అంత ధరకు అప్పగించాల్సి వస్తోంది. ఫలితంగా ఇక్కడ ట్యూనా మార్కెట్‌పై దళారులే పెత్తనం చెలాయిస్తున్న పరిస్థితులు దాపురించాయి. మత్స్యకారులకు కిలోకు రూ.120 నుంచి గరిష్టంగా రూ.180 వరకూ మాత్రమే ముట్టజెబుతున్నారు. ఇక వేట నిషేధ సమయంలో పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు చిన్న పడవలపై వందల కిలోమీటర్లు వెళ్లి ట్యూనా తీసుకొస్తుంటే.. దళారులు మాత్రం అన్‌ సీజన్‌ అంటూ కిలోకి రూ.90 నుంచి రూ.100 మాత్రమే చేతుల్లో పెడుతున్నారని వారు వాపోతున్నారు.

1000 మీటర్ల లోతు వరకు వేట

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి ప్రతి రోజూ 300 బోట్ల వరకు ట్యూనా వేట కోసం బయలుదేరుతుంటాయి. తీరం నుంచి 70 నాటికల్‌ మైళ్ల దూరం ప్రయాణించిన తర్వాత, 700 నుంచి 1000 మీటర్ల లోతులో ట్యూనా సంపద విస్తృతంగా ఉంది. కాకినాడ, విశాఖకు చెందిన మత్స్యకారులు పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక సముద్ర జలాల వరకూ వెళ్లి వేటను సాగిస్తుంటారు. వేట కోసం సుమారు 90 బాస్కెట్లను సముద్రంలో విడిచిపెడతారు. ఒక్కో బాస్కెట్‌లో 6 హుక్స్‌(గాలాలు) ఉంటాయి. 4 గంటల పాటు హుక్స్‌ని నీటిలో ఉంచి, తర్వాత ఒక్కో బాస్కెట్‌ని బయటికి తీసి ట్యూనాలను పట్టుకొని తిరిగి వస్తుంటారు. ఇంజిన్‌ బోట్లతో పాటు సంప్రదాయ మరపడవలపై వెళ్లి మరీ ఈ వేట సాగిస్తుంటారు. ట్యూనా తర్వాత ఎక్కువగా కొమ్ముకోనాం చేపలు ఇక్కడి మత్స్యకారులకు చిక్కుతున్నాయి.

కొన్ని సందర్భాల్లో ట్యూనాయే దిక్కు

వేట విరామ సమయంలో చిన్న పడవలు వేసుకొని వెళ్తున్నాం. అప్పుడు ట్యూనా చేపలే మాకు దిక్కవుతున్నాయి. కానీ.. ఇంత కష్టపడి తీసుకొస్తున్నా ఆశించిన ధర రావడం లేదు. ఎంత చెబితే అంతకు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే స్థానికంగా మార్కెటింగ్‌ సౌకర్యం లేదు. అందుకే తక్కువ ధరకు అమ్ముకుంటున్నాం. – మేరుగు ఎల్లాజీ, మత్స్యకారుడు, మంగమారిపేట

దేశీయ మార్కెట్‌లో అయితే ఎక్కువగా విశాఖ నుంచి కేరళకు ట్యూనా ఎగుమతి జరుగుతోంది. శుద్ధి చేసిన ట్యూనాలు అమెరికా, థాయ్‌లాండ్‌, హాంకాంగ్‌, మలేసియా, వియత్నాం, చైనా తదితర దేశాలకు అధిక సంఖ్యలో ఎగుమతి అవుతున్నాయి. ఈ చేపల్లో ముళ్లు తక్కువగా ఉంటాయి. అధికశాతం ప్రొటీన్లు, ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు ఎక్కువగా ఉండటంతో డిమాండ్‌ పెరుగుతోంది. కేరళలో ప్రాసెస్‌ చేసిన తర్వాత.. కిలో రూ.350 నుంచి రూ.800 వరకూ విక్రయిస్తున్నారు. కానీ.. శ్రమకోర్చి చేపలు పట్టిన మత్స్యకారుడు మాత్రం దోపిడీకి గురవుతున్నాడు.

విశాఖ, కాకినాడ తీరాల్లో భారీగా లభిస్తున్న ట్యూనా సంపద

మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి

ట్యూనా చేపలు హార్బర్‌కు ఎక్కువగా వస్తున్నాయి. అయితే కష్టానికి సరిపడా ధర అందడం లేదు. ఇక్కడ మార్కెట్‌ సదుపాయాన్ని కల్పిస్తే మత్స్యకారులంతా లాభపడతారు. అదేవిధంగా కోల్డ్‌ స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడు నేరుగా ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. అమెరికా, జపాన్‌, యూరప్‌, దక్షిణ ఆసియా దేశాల్లో ట్యూనాల వినియోగం అధికంగా ఉంది. అక్కడకు ఎగుమతి చేస్తే మంచి ధర లభిస్తుంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. –సూరాడ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు, వైశాఖి మరపడవల సంఘం

సిరుల ట్యూనా.. దళారులకేనా?1
1/3

సిరుల ట్యూనా.. దళారులకేనా?

సిరుల ట్యూనా.. దళారులకేనా?2
2/3

సిరుల ట్యూనా.. దళారులకేనా?

సిరుల ట్యూనా.. దళారులకేనా?3
3/3

సిరుల ట్యూనా.. దళారులకేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement