అమ్మా అని పిలిచేదెవరు.?
ఆ బుడిబుడి అడుగులకు తెలియదు.. అక్కడ మృత్యువు నోరు తెరుచుకుని ఉందని. ఆడుకునే ఆశతో అడుగు వేసిన చిన్నారిని నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ బలిగొంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు అకాల మరణం ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. ముచ్చర్లలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి
పెట్టిస్తోంది. – తగరపువలస
ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన లెంక గణేష్, కనకం దంపతులు నిత్యం కష్టపడితే గానీ ఇల్లు గడవని పేద కుటుంబం. గణేష్ పెట్రోల్ బంకులో పనిచేస్తుండగా, కనకం వ్యవసాయ కూలీ. తమ కష్టమంతా పిల్లల భవిష్యత్తు కోసమే అని బతుకుతున్నారు. వీరికి మూడేళ్ల ఢిల్లీశ్వరి, ఏడాదిన్నర బాబు చాణక్య ఉన్నారు. అక్కా తమ్ముడు ఇల్లంతా సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు తమ కష్టాన్ని మరిచిపోయేవారు. కాగా.. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయం. ఢిల్లీశ్వరి ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. ఎప్పుడూ ఇంటి చుట్టుపక్కల ఆడుకుని తిరిగి వచ్చే కూతురు, ఎంతసేపటికీ రాకపోయే సరికి తండ్రి గణేష్ గుండెలో ఆందోళన మొదలైంది. ఊరంతా గాలించాడు. చివరికి గ్రామంలోని రెండో వీధిలో పైడి రాజు అనే వ్యక్తికి చెందిన నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో చూడగా.. లోపల తన చిట్టితల్లి విగతజీవిగా కనిపించింది. ఆ దృశ్యం చూసి ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. కూతురిని వెంటనే బయటకు తీసి, గుండెకు హత్తుకుని, ఇంకా ఊపిరి ఉందేమోనన్న చిన్న ఆశతో సంగివలసలోని అనిల్ నీరుకొండ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయిందని, పాప మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు.
కన్నీటి సంద్రంలో ముచ్చర్ల
‘నా బిడ్డ లేని ఇల్లు చిన్నబోతుంది.. ఇక మాకు అమ్మా అని ఎవరూ పిలుస్తారు?’అంటూ ఆ తల్లిదండ్రులు చేస్తున్న రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. ఢిల్లీశ్వరి స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తుండేది. గురువారం క్రిస్మస్ సెలవు కావడంతో ఆడుకోవడానికి వెళ్లి మృత్యువాత పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండగ రోజున జరిగిన ఈ ఘటన ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. కాగా చిన్నారి ఎవరితో ఆడుకోవడానికి వెళ్లిందో తెలియరాలేదు. ఆనందపురం సీఐ వాసునాయుడు ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ బాలంనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మా అని పిలిచేదెవరు.?


