ఏయూలో స్టిక్కరింగ్ గందరగోళం
క్యాంపస్‌లో వాహనాలకు గుర్తింపు స్టిక్కర్లు
ఆ స్టిక్కర్లు ఉన్న వాహనాలకే ఏయూలోకి అనుమతి
ఇందుకోసం వాహనాల వివరాలు ఇవ్వాలని రిజిస్ట్రార్ సర్క్యులర్
యూనివర్సిటీలో స్టేట్ బ్యాంక్, పోస్టాఫీస్ సేవలు
వీటికి వచ్చే వారి పరిస్థితేంటన్న ప్రశ్నలు ఉత్పన్నం
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరో వివాదాస్పద నిర్ణయానికి అధికారులు తెరతీశారు. క్యాంపస్‌లో భద్రత పేరుతో వాహనాలకు గుర్తింపు స్టిక్కర్లు ఇవ్వాలని నిర్ణయించారు. అవి ఉన్న వాహనాలనే యూనివర్సిటీలోకి అనుమతించనున్నారు. ఇందుకోసం ఉద్యోగులు, డే స్కాలర్, రీసర్చ్ స్కాలర్ల వాహనాల వివరాలు ఇవ్వాలని అన్ని విభాగాలకు సర్క్యులర్ జారీ చేశారు. అయితే దీనిపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముందస్తు చర్చ లేకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఏయూతోపాటు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. ఆకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు సైతం విస్తుపోతున్నారు. గుర్తింపు స్టిక్కర్లు ఉన్న వాహనాలను మాత్రమే లోపలకు అనుమతిస్తే.. ఏయూలో బ్యాంక్, పోస్టాఫీస్ సేవలు వినియోగించుకుంటున్న వారి పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పనుల కోసం వచ్చేవారు ఎలా?
ఏయూలోకి కేవలం గుర్తింపు స్టిక్కర్లు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించేలా ఆలోచన చేస్తుండడం గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఏయూలో కోర్సులు, ఇతరత్రా సందేహాలు, అవసరాల నిమిత్తం నిత్యం అనేక మంది వస్తుంటారు. ప్రధానంగా క్యాంపస్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్టాఫీస్‌లు ఉన్నాయి. వీటి సేవలను ఏయూ ఉద్యోగులు, విద్యార్థులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు, సిబ్బంది, అలాగే బయట వ్యక్తులు కూడా అనేక ఏళ్లుగా వినియోగిస్తున్నారు. వీరిని ఏయూలోకి అనుమతించని పక్షంలో వారికి బ్యాంక్, పోస్టాఫీస్ సేవలు అందకుండా పోతాయి. అలాగే క్యాంపస్‌లో ఐఐపీఈ, ఐఐఎం సంస్థలు ఉన్నాయి. వీటిలో పనిచేసే సిబ్బంది పరిస్థితి ఏంటన్న దానిపై అయోమయం నెలకొంది. నిత్యం సర్టిఫికెట్ల కోసం పరీక్షా విభాగానికి, ఇతరత్రా సమాచారం, అవసరాల కోసం అనేక మంది విద్యార్థులు వస్తుంటారు. వీరికి స్టిక్కర్లు ఇచ్చే అవకాశం లేదు. వీరిని ఏయూలోకి అనుమతించని పక్షంలో ఏయూ సేవలు, సమాచారాన్ని ఎలా పొందుతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు
వాహనాలకు గుర్తింపు స్టిక్కర్లతో కలిగే ఇబ్బందులపై ఎటువంటి ముందస్తు ఆలోచన చేయకుండా తీసుకున్న నిర్ణయాన్ని వర్సిటీ ఉద్యోగులే వ్యతిరేకిస్తున్నారు. ఏయూ క్యాంపస్‌లో భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజిస్ట్రార్ అన్ని విభాగాలకు లేఖ పంపించారు. వెంటనే ఏయూలో అన్ని విభాగాల్లో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తోపాటు డే స్కాలర్లు, రీసెర్చ్ స్కాలర్లు తమ వాహనాల వివరాలను ఎక్సెల్ ఫార్మట్‌లో ఏయూ సెక్యూరిటీ ఆఫీస్‌లో అందజేయాలని అందులో పేర్కొన్నారు. వీటిని మంజూరు చేసిన తర్వాత.. ఈ స్టిక్కర్లు ఉన్న వాహనాలనే ఏయూలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


