మధుర ఫలం.. ముందే వచ్చేసింది!
సీతంపేట: ఒకప్పుడు ఉగాదికి మామిడి పిందెలు వచ్చేవి. మామిడి పండ్ల రుచిని ఆస్వాదించాలంటే మే వరకు ఆగాల్సి వచ్చేది. కానీ, కాలం మారింది.. దాంతో పాటు పంట విధానాలూ మారాయి. ఇప్పుడు విశాఖ వాసులకు శీతాకాలంలోనే ఫలరాజు దర్శనమిస్తున్నాడు. సాధారణ సీజన్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ.. శంకరమఠం రోడ్డులో మామిడి పండ్లు కనువిందు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ పండ్లను స్థానిక వ్యాపారులు విక్రయిస్తున్నారు. సీజన్ కాని సీజన్‌లో పసుపు రంగులో మెరుస్తున్న మామిడిని చూసి నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ మామిడి పండ్ల ధర కిలో రూ. 300గా ఉంది. ధర కాస్త ఘాటుగానే ఉన్నా.. మామిడిపై ఉన్న మక్కువతో మ్యాంగో లవర్స్ ఎగబడి మరీ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ.. ఇప్పుడు ఏడాదికి మూడు సార్లు కాపు కాసే కొత్త రకం మామిడి పంటలు వచ్చాయని, దీని వల్ల ఏడాది పొడవునా మామిడి కాయలతో పాటు, పండ్లు కూడా అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు.
శీతాకాలంలోనే నోరూరిస్తున్న మామిడి


