
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పొల్గొన్న వైభవ్ సూర్యవంశీ, పుల్లెల గోపీచంద్, ధన్ రాజ్ పిళ్లై
విశాఖ స్పోర్ట్స్: విశాఖ పోర్టులో శుక్రవారం రాత్రి ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఆరంభమైంది. అభిమానుల కోలాహలం, సందడి వాతావరణం మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 38–35 తేడాతో తెలుగు టైటాన్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డాయి.
ప్రోకబడ్డీ లీగ్ 12వ సీజన్‌ను తమిళ్ తలైవాస్ జట్టు విజయంతో ప్రారంభించింది. మ్యాచ్ ఆఖరి క్షణంలో తలైవాస్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ తన మాజీ జట్టుపై చేసిన సూపర్ రైడ్తో విజయం సాధించారు. ఒక దశలో టైటాన్స్ 27–20 ఆధిక్యంతో విజయం సాధించేలా కనిపించినా, చివరిలో తడబడింది. తలైవాస్ తరఫున స్టార్ రైడర్ అర్జున్ దేశ్వాల్ 12 పాయింట్లతో సూపర్ టెన్ సాధించాడు.
తెలుగు టైటాన్స్ జట్టులో ఆల్‌రౌండర్ భరత్ 11 పాయింట్లతో రాణించినా ఫలితం దక్కలేదు. కెప్టెన్ విజయ్ మాలిక్ 6 పాయింట్లు, డిఫెండర్ శుభం షిండే 4 పాయింట్లు సాధించారు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన జాతీయగీతాలాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, ఐపీఎల్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, హాకీ ఆటగాడు ధన్‌రాజ్ పిళ్లై తదితరులు పాల్గొన్నారు.
శనివారం తెలుగు టైటాన్స్ జట్టు యూపీ యోధాస్‌తో తలపడనుంది. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుండగా మరో పోటీలో యు ముంబా జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. మరో మ్యాచ్‌లో బెంగళూర్ బుల్స్ జట్టుపై పునేరి పాల్టన్ జట్టు విజయం సాధించింది.

తెలుగు టైటాన్స్‌పై తమిళ్ తలైవాస్ ఉత్కంఠ విజయం