
తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌తో తమిళ్ తలైవాస్ ‘ఢీ’
రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
విశాఖ స్పోర్ట్స్: భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా... చెప్పుకోదగిన స్థాయిలో అభిమానుల్ని సంపాదించుకున్న లీగ్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్). గత 11 ఏళ్లుగా కబడ్డీ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్న పీకేఎల్ 12వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. నేడు ‘జాతీయ క్రీడా దినోత్సవం’ రోజున ఉక్కు నగరం విశాఖపట్నంలో కబడ్డీ కూత మొదలు కానుంది. ప్రతీ రోజు రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి పోరు తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరుగుతుంది.
తర్వాత రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో పుణేరి పల్టన్ తలపడుతుంది. గత సీజన్లలా కాకుండా కొత్త షోకులతో ఈ సీజన్ పోటీలు జరుగుతాయి. మ్యాచ్ ‘టై’తో కాకుండా ఫలితంలో ముగించేందుకు టై–బ్రేకర్‌ను తీసుకొచ్చారు. లీగ్ దశ తర్వాత పాయింట్ల పట్టికలో తొలి 4 జట్లు కాకుండా మొత్తం 8 జట్లు టైటిల్ రేసులో ఉండేలా ప్లే ఆఫ్స్‌ను మార్చారు. ఫుట్‌బాల్‌లో పెనాల్టీ షూటౌట్ తరహా ఐదు రెయిడ్‌ల షూటౌట్‌ను ఇకపై చూడొచ్చు.
జయజయధ్వానాలతో...
సీజన్ ప్రారంభానికి ముందు గురువారం లీగ్‌లో పాల్గొనే 12 ఫ్రాంచైజీల కెపె్టన్లు భారత సాయుధ బలగాలకు జేజేలు పలికారు. ఇందులో భాగంగా విశాఖ తీరంలో ఉన్న ‘ఐఎన్‌ఎస్ కుర్సురా’ జలాంతర్గామిని 12 జట్ల కెపె్టన్లు సందర్శించారు. ఈ సబ్ మెరైన్ 1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
హైదరాబాద్‌లో ‘కూత’ లేదు
ఈ సీజన్ లీగ్ దశను నాలుగు వేదికల్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఒక్క మ్యాచ్‌ను ఏర్పాటు చేయలేదు. తెలుగు టైటాన్స్ ఆడే మ్యాచ్‌లన్నీ వైజాగ్‌కు తరలించారు. ఈ అంచె పోటీలు సెప్టెంబర్ 11న ముగిశాక... జైపూర్‌లో 12 నుంచి 28 వరకు జరుగుతాయి. ఆ మరుసటి రోజే చెన్నై అంచె పోటీలు మొదలై అక్టోబర్ 10న ముగుస్తాయి. ఆఖరి లీగ్ దశ పోటీలు ఢిల్లీలో 11 నుంచి 23 వరకు జరుగుతాయి.
బరిలో 12 ఫ్రాంచైజీలివే...
తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, జైపూర్ పింక్‌పాంథర్స్, పట్నా పైరేట్స్, పుణేరి పల్టన్, తమిళ్ తలైవాస్, యుముంబా, యూపీ యోధాస్.
లీగ్ దశలో 108 మ్యాచ్‌లు
మారిన ఫార్మాట్‌లో 12వ సీజన్‌ను నిర్వహిస్తారు. లీగ్ దశలో 108 మ్యాచ్‌లు జరుగుతాయి. 12 ఫ్రాంచైజీలు 18 మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి. గెలిచిన జట్టుకు 2 పాయింట్లు. ఓడితే పాయింట్ ఉండదు. బోనస్ పాయింట్‌ను ఎత్తేశారు. కొత్త టై–బ్రేక్ పద్ధతిలో స్కోరు సమమైతే గోల్డెన్ రెయిడ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.