Adudam Andhra: వేడుక అదుర్స్‌ | - | Sakshi
Sakshi News home page

Adudam Andhra: వేడుక అదుర్స్‌

Feb 14 2024 8:18 AM | Updated on Feb 16 2024 12:54 PM

- - Sakshi

సాక్షి, విశాఖపట్నం/విశాఖ స్పోర్ట్స్‌ : ఉల్లాసంగా.. ఉత్సాహంగా..‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రీడా పోటీలు మంగళళవారం విశాఖ వైఎస్సార్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో అంగరంగ వైభవంగా ముగిశాయి. మట్టిలో మాణిక్యాలను ఒడిసిపట్టే మహాయజ్ఞం విశాఖ సాగర తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి క్రీడాకారులు విశాఖలో ఐదురోజుల పాటు ఉత్సాహంగా గడిపారు.


              ఆడుదాం ఆంధ్రా థీమ్‌ సాంగ్‌కు నృత్యం చేస్తున్న క్రీడాకారులు
గత ఏడాది డిసెంబర్‌ 26న విజయవాడలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. క్రికెట్‌, వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ క్రీడల్లో యువతీయువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూ, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక వేడుకలు ఘనంగా ముగిశాయి.

యువతలో స్ఫూర్తినింపిన క్రీడలు
విశాఖలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు యువతలో క్రీడలపై ఆసక్తిని పెంచాయి. చదువే కాదు క్రీడలు సైతం భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయన్న భరోసాను యువతకు కల్పించాయి.


వైఎస్సార్‌ స్టేడియంలో మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ఆరోగ్యం వ్యాయామాల పట్ల ప్రజలకు అవగాహన పెరగాలన్నది ఆడుదాం ఆంధ్రా పోటీల మొదటి ఉద్దేశమని చెప్పారు. ఇక్కడి విజేతలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా సంస్థలు ఎంపిక చేసిన విషయం ముఖ్యమంత్రి ప్రకటించడంతో యువతలో ఉత్సాహం ఉరకలెత్తింది.

కిటకిటలాడిన స్టేడియం
ఆడుదాం ఆంధ్రా ఫైనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు వేలాది మంది యువత హాజరై మ్యాచ్‌ తిలకించారు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ మ్యాచ్‌కు వచ్చినట్లుగా విశాఖ నగర యువతతో పాటు సమీప జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.


                స్టేడియంలో ఉత్సాహంగా అభిమానులు

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినప్పటి నుంచి యువత కేరింతలు, ఈలలతో స్టేడియం మార్మోగింది. ముఖ్యమంత్రి దాదాపు అరగంట పాటు ఫైనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను వీక్షించారు.

హోరెత్తిన మైదానం
ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలతో వైఎస్సార్‌ స్టేడియం హోరెత్తింది. ఒక పక్క చిన్నారుల నృత్యాలు.. మరో వైపు లేజర్‌ షో, ఫ్లాష్‌లైట్లతో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తొలుత స్టేడియంలో దుబాయ్‌ జట్టు ఫ్లాష్‌ డ్యాన్స్‌ చక్‌ దే ఇండియా అంటూ అలరించగా కూచిపూడి నృత్యకారిణులు ఓం నమఃశివాయ అంటూ చేసిన ప్రదర్శన అలరించింది. క్రీడాకారులు జయహో అంటూ చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.


                             నృత్యం చేస్తున్న కళాకారులు

మూడు కళారూపాలతో ‘ఆడుదాం ఆంధ్రా’ థీమ్‌ సాంగ్‌కు చేసిన నృత్యం అబ్బురపరిచింది. ఒక్కసారిగా స్టేడియంలో లైట్స్‌ఆఫ్‌ అయ్యాయి. అంతే డ్రోన్స్‌ ప్రత్యక్షమయ్యాయి. అనంతరం వియ్‌ ఆర్‌ రాకింగ్‌ అంటూ ఫ్లాష్‌ ఫోతో స్టేడియం మిరమిట్లు గొలిపే కాంతులీనింది. స్టేడియం మొత్తం లైట్లతో లయబద్ధంగా నాట్యమాడింది. రెండు నిమిషాలపాటు బాణసంచాతో స్టేడియం దద్దరిల్లింది.


                            స్టేడియంలో క్రికెట్‌ ఫైనల్‌ పోరు

పటిష్ట బందోబస్తు
క్రీడోత్సవాలకు భారీగా క్రీడాకారులు, జనం తరలివచ్చినా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. స్థానిక సీఐ వై.రామకృష్ణ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కారు షెడ్‌ కూడలిలో ట్రాఫిక్‌ సమస్యలు నివారించడానికి సిబ్బందికి విధులు అప్పగించారు. పీఎంపాలెం–కొమ్మాది–వుడారోడ్డు –చంద్రంపాలెంకు వెళ్లే వాహనాలను క్రమబద్ధీకరించారు.

వేడుకల్లో పాల్గొన్న వారు వీరే..


డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్‌కే రోజా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఇన్‌ఛార్జి మంత్రి విడదల రజనీ, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్దారెడ్డి, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, వైఎస్సార్‌సీపీ విశాఖ పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్‌కుమార్‌, తిప్పలనాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, కె.భాగ్యలక్ష్మి, కంబాల జోగులు, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌, విశాఖ ఉత్తర సమన్వయకర్త కె.కె రాజు,గాజువాక ఇన్‌చార్జి ఉరుకూటి చందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement