
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ తిరిగి గెలుపుబాట పట్టింది. గత మూడు మ్యాచ్‌ల్లో ఓడిన టైటాన్స్ శుక్రవారం జరిగిన పోరులో 43–29 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది. టైటాన్స్ కెపె్టన్ విజయ్ మలిక్ 10 పాయింట్లతో విజృంభించాడు. భరత్ 8 పాయింట్లతో అతడికి సహకరించాడు. తమిళ్ తలైవాస్ తరఫున కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 7 పాయింట్లతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు.
తాజా సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ 4 విజయాలు, 5 పరాజయాలతో 8 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 34–30 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్ చేతిలో ఓడింది. టేబుల్ టాపర్ పుణేరి పల్టన్‌కు వరుసగా మూడు విజయాల తర్వాత ఇదే తొలి ఓటమి.
హర్యానా స్టీలర్స్ తరఫున వినయ్ 13 పాయింట్లు సాధించగా... పుణేరి పల్టన్ తరఫున పంకజ్ 14 పాయింట్లతో పోరాడాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరెట్స్‌తో దబంగ్ ఢిల్లీ, హరియాణా స్టీలర్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి.