
ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థులను అభినందిస్తున్న మంత్రి లోకేష్
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
చంద్రంపాలెం హైస్కూల్‌లో ఏఐ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి
మధురవాడ: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైయేంట్ లిమిటెడ్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఐ అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులతో మాట్లాడి సాంకేతిక పరిజ్ఞానం జీవితంలో తీసుకువచ్చే మార్పుల గురించి వివరించారు. ఏఐ, స్టెమ్, రోబోటిక్స్ టూల్స్‌తో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఆయన పరిశీలించి, అభినందించారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థినులు అరుణశ్రీ, భాగ్యలక్ష్మిలు రూపొందించిన ‘స్మార్ట్ ఫార్మింగ్’ ప్రాజెక్టును ఆసక్తిగా తిలకించారు. పాఠశాల మైదానం బురదమయంగా ఉండడం గతంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
24 గంటల్లోగా ఈ సమస్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదిలావుండగా పాఠశాల ప్రాంగణంలో టీడీపీ జెండాలు, రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. టీడీపీ కార్పొరేటర్లను లోపలికి వెళ్లనీయకుండా సెక్యూరిటీ బైటకి తోసేయడంతో వారంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో గంటా శ్రీనివాసరావు కొద్ది సేపటి తర్వాత వచ్చి కార్పొరేటర్లను లోపలికి తీసుకు వెళ్లారు. కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, గాదే శ్రీనువాసులు నాయుడు, ఆర్‌జేడీ విజయభాస్కర్, డీఈవో ప్రేమకుమార్ తదితరులు పాల్గొన్నారు.