
పార్టీ నేతలకు, కార్యకర్తలకు విలువ లేదని ఆవేదన
ఎమ్మెల్యేలు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆక్రోశం
ఎన్నికల్లో కష్టపడినా తమకు గుర్తింపు లేదని మండిపాటు
వారిని బుజ్జగించడానికి కిందా మీదా పడిన పవన్ కల్యాణ్
విశాఖ సిటీ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో అసంతృప్తి జ్వాలలు పెల్లుబికాయి. కూటమి ప్రభుత్వంలో తమకు విలువ లేకుండా పోయిందని పార్టీ నేతలు ఆక్రోశం వెళ్లగక్కారు. ఎమ్మెల్యేలు, అధికారులు తమను కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తే.. అధికారంలోకి వచ్చాక పక్కనపెట్టేశారని అధినేతనే నిలదీశారు. తమకు పదువులే కాదు.. కనీసం గుర్తింపు కూడా లేదని వాపోయారు. వారిని సముదాయించడానికి పవన్ కల్యాణ్ కిందా మీదా పడాల్సి వచ్చింది. జనసేన ప్లీనరీ సందర్భంగా రెండు రోజులుగా విశాఖలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో పవన్ కల్యాణ్ వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా భేటీ అయ్యారు. ఇందులో నేతలు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వంలో తమ పరిస్థితులను, కష్టాలను అధినేత దృష్టికి తీసుకువెళ్లారు.
జనసైనికులు, వీర మహిళలే పార్టీకి బలం
జనసేన పార్టీ సైద్ధాంతిక భావజాలాన్ని నమ్మిన జనసైనికులు, వీర మహిళలే పార్టీకి బలమని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ఇచ్చే బలంతోనే జనసేన జాతీయ పార్టీ స్థాయికి ఎదిగేలా పనిచేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా, సిద్ధాంతాన్ని నమ్మే సమూహం కావాలని పిలుపునిచ్చారు. సినిమా అభిమాన బలాన్ని రాజకీయంగా వ్యవస్థీకృతం చేయాలి. ఎవరో ఒకరికి బాధ్యత అప్పగించడం తన ఉద్దేశం కాదని, పార్టీని సంస్థాగతంగా ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నామని చాలా మంది అడుగుతున్నారన్నారు. కానీ జనసేనను భుజాన వేసుకుంటూ మోస్తున్నది జనసైనికులు, వీరమహిళలే అన్నారు. కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.
కూటమిలో విలువ లేదు..
కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలు, కార్యకర్తలకు కనీసం విలువ లేకుండా చేస్తున్నారని కొందరు అధినేతకు ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే వారి స్వప్రయోజనాలు చూసుకుంటున్నారని, తమను కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అధికారులు సైతం తమకు విలువ ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడితే ఇప్పటి వరకు పదవులు లేవని, గుర్తింపు కూడా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మరికొందరు మాత్రం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువవుతోందని, దీని నుంచి బయట పడే విషయంపై పార్టీ పెద్దలు దృష్టిసారించాలని సూచించినట్లు తెలిసింది. రాష్ట్రంలో పార్టీ ఇంకా ఎదగాలని, ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా ఆ ప్రభావం పార్టీపై కూడా పడుతోందని, ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు వచ్చే ప్రమాదముందని హెచ్చరించినట్లు సమాచారం. అసంతృప్తితో ఉన్న నేతలు, కార్యకర్తలకు అధినేత పవన్ సర్ధిచెప్పడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది.