
యాత్రీ నివాస్ భవనం
వైఎస్సార్ సీపీ హయాంలో యాత్రీ నివాస్ నిర్మాణం
ఎన్నికల సమయానికే 85 శాతం పనులు పూర్తి
కూటమిలో నెమ్మదించిన పనులు
ఇటీవలే నిర్మాణం పూర్తి.. బుకింగ్‌లు కూడా ప్రారంభం
నేడు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభానికి హడావుడి
విశాఖ సిటీ : కూటమి ప్రభుత్వంలో ప్రారంభోత్సవాలన్నీ అయిపోయిన పెళ్లికి బాజాలు అన్నట్లే ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ కూటమి ప్రభుత్వమే చేపట్టినట్లు కలరింగ్ ఇస్తోంది. నెలల క్రితం కార్యకలాపాలు ప్రారంభించిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాల పేరిట హడావుడి చేస్తుండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా బీచ్ రోడ్డులో లుంబినీ పార్క్ ఎదురుగా పర్యాటక శాఖకు చెందిన యాత్రీ నివాస్ ప్రారంభోత్సవంలోను అదే పరిస్థితి కనిపిస్తోంది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.12.3 కోట్లతో యాత్రీ నివాస్ భవన నిర్మాణాలు చేపట్టగా అప్పట్లో 85 శాతం పనులు పూర్తయ్యాయి. దేశ విదేశీ పర్యాటకులకు వారి అభిరుచులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలతో నిర్మాణాలు ఎన్నికల సమయానికే దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. స్టార్ హోటల్స్‌కు ధీటుగా చేపట్టిన భవన నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక నెమ్మదించాయి. మొత్తం 4 అంతస్తుల భవనంలో 46 గదులు, రెస్టారెంట్ ఉన్న ఈ పర్యాటక హోటల్‌ను ప్రైవేటుకు ఇచ్చేందుకు ఇప్పటికే టెండర్లు సైతం ఆహ్వానించారు.
బుకింగ్‌లు మొదలయ్యాక ప్రారంభోత్సవమంట..
యాత్రీ నివాస్‌లో 42 ఏసీ గదులు ఉన్నాయి. వీటిని ఏసీ సూట్, ఏసీ డీలక్స్, ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్‌లుగా విభజించారు. ఇందులో ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభించారు. ఇద్దరు టూరిస్టులకు ఏసీ సూట్ రూమ్ డిమాండ్‌ను బట్టి రూ.3,750 నుంచి రూ.4,200, ఏసీ డీలక్స్ రూ.4,625 నుంచి రూ.5,180 వరకూ, ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్‌కి రూ.3,125 నుంచి రూ.3,500(ట్యాక్స్ అదనం) వరకూ వసూలు చేస్తున్నారు. రూమ్‌లతో పాటు అత్యాధునిక వసతులతో రెస్టారెంట్, బార్, వెయిటింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్ మొదలైనవి అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం ఎక్కువగా పశ్చిమబెంగాల్, ఒడిశాతో పాటు ఉత్తరభారత దేశానికి చెందిన పర్యాటకులు బస చేస్తున్నారు. బుకింగ్ ప్రారంభించిన వారాల తర్వాత ఇప్పుడు ఈ హోటల్‌ను ప్రారంభించడానికి రాష్ట్ర పర్యాటక శాఖ కందుల దుర్గేష్ వస్తున్నారు. శనివారం ఆయన చేతుల మీదుగా యాత్రీ నివాస్ ప్రారంభోత్సవానికి హడావుడి చేస్తున్నారు. అయిపోయిన పెళ్లికి బాజాలు అన్నట్లు.. బుకింగ్‌లు ప్రారంభమయ్యాక కూడా మంత్రి దుర్గేష్ ప్రారంభోత్సవానికి రావడం పట్ల పర్యాటక శాఖలో సిబ్బందే విస్తుపోతున్నారు.