
రేపు ‘వర్షాకాలం పరిశుభ్రత’
మహారాణిపేట: ఆగస్టు థీమ్ అయిన ‘వర్షాకాలం పరిశుభ్రత’పై దృష్టి సారించి కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 23న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో, ప్రజల్లో పారిశుధ్య విలువలను ప్రోత్సహించాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు ఈ కార్యక్రమాలను తప్పనిసరిగా పర్యవేక్షించాలని, ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించాలని, కమ్యూనిటీ టాయిలెట్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకుగాను, నీటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.