
అట్టహాసంగా ‘కళా ఉత్సవ్’
కంచరపాలెం: కేంద్రీయ విద్యాలయ–2 ప్రాంగణం.. విద్యార్థుల సందడితో పండగ వాతావరణం నెలకొంది. జాతీయ సమైక్యతను చాటే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘కళా ఉత్సవ్’ (జాతీయ ఐక్యత దివాస్) గురువారం వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలను మేనేజింగ్ కమిటీ చైర్మన్ కమాండర్ ధీరజ్ కన్న, చైర్మన్ నామినీ కమాండ్ సోనాల్ ద్రావిడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండర్ ధీరజ్ కన్న మాట్లాడుతూ ఇలాంటి ఉత్సవాలు విద్యార్థుల్లో కళలు, సాంస్కృతిక విలువలపై అవగాహన కల్పించడమే కాకుండా, వారిలో జాతీయ సమైక్యతా భావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని 8 క్లస్టర్లకు చెందిన 72 పాఠశాలల నుంచి సుమారు 420 మంది విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పాల్గొనడం విశేషం. వారు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వినూత్నంగా రూపొందించిన ప్రయోగాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సి.హెచ్.శ్రీనివాసులు, సిబ్బంది బాలాజీ, రామ్‌భూపాల్, జ్యోతిప్రకాష్, వినోద్, బాషా తదితరులు పాల్గొన్నారు.
డ్యాన్స్ చేస్తున్న విద్యార్థినులు

అట్టహాసంగా ‘కళా ఉత్సవ్’