
భారీ దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్
అల్లిపురం: షీలానగర్‌లోని విజయ దుర్గ పాలిమర్స్ కంపెనీ యజమాని ఫ్లాట్‌లో ఈ ఏడాది జూలై 13న జరిగిన దొంగతనం కేసును నగర క్రైం పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 72 తులాల బంగారు ఆభరణాలు, రూ.9.04 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ కె. లతామాధురి ఈ కేసు వివరాలను వెల్లడించారు. షీలానగర్‌లోని వేంకటేశ్వర కాలనీ, లక్ష్మి అపార్ట్‌మెంట్‌లో సప్ప నాగమణి కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆమె ఫ్లాట్‌లో పాలిషింగ్ పనులు జరుగుతుండటంతో.. జూలై 12న రాత్రి 10.30 గంటలకు తన భర్త, చిన్న కూతురుతో కలిసి కింద ఫ్లోర్‌లోని మరో ఫ్లాట్‌లో నిద్రపోయారు. జూలై 13న తెల్లవారుజామున 4.25 గంటలకు తిరిగి తమ ఫ్లాట్‌కు రాగా.. ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపల బీరువా లాకర్ కూడా పగలగొట్టి ఉండగా.. అందులో ఉన్న సుమారు 100 తులాల బంగారు ఆభరణాలు, రూ.13.5 లక్షల నగదు కనిపించలేదు. దీనిపై ఆమె గాజువాక క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన క్రైం పోలీసులు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అర్జున జ్ఞాన ప్రకాష్, లింగిబెడి రాంబాబులు ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. వీరు తెలంగాణ రాష్ట్రం మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసులో నిందితులుగా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. సౌత్ జోన్ క్రైం ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం మలక్‌పేట వెళ్లి నిందితులను విచారించింది. విచారణలో నర్సీపట్నం, అయ్యన్న కాలనీ, పీనరిపాలెం ప్రాంతానికి చెందిన చిటికల నాగేశ్వరరావు అలియాస్ నాగేష్ ఈ దొంగతనానికి సూత్రధారి అని తేలింది. సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు గాజువాక బి.సి.రోడ్డులోని మసీదు వద్ద నాగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు చంచల్‌గూడ జైలు నుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చిన ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
72 తులాల బంగారం,
రూ. 9.04 లక్షలు స్వాధీనం