
యువతి ఆత్మహత్య
దర్యాప్తు కోరిన తల్లి
గాజువాక: తల్లితో కలిసి అక్కిరెడ్డిపాలెంలో నివాసముంటున్న ఒక యువతి గురువారం ఆత్మహత్య చేసుకుంది. మృతిపై వివరాలు తెలియరాలేదు. తన కుమార్తె ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు తెలిసిందని, అందువల్ల ఈ మృతిపై తగిన దర్యాప్తు చేయాలని ఆమె తల్లి పోలీసులను కోరింది. వివరాలివి. అక్కిరెడ్డిపాలెంలో నివాసముంటున్న కోట్ని కనకమహాలక్ష్మి భర్త 15 కిందట మృతి చెందారు. అప్పటినుంచి కుమార్తె ప్రవల్లిక (23), కుమారుడు సాయి సంపత్‌తో కలిసి అక్కిరెడ్డిపాలెంలోని తమ తల్లిదండ్రులు ఉంటున్న వీధిలోనే నివాసముంటోంది. ప్రవల్లిక ఇటీవల ఎమ్మెస్సీ పూర్తి చేసి కాంపిటేటివ్ పరీక్షలకు సాధన చేస్తోంది. కనక మహాలక్ష్మి, ఆమె కుమారుడు టయోటా కార్ల షోరూమ్‌లో పని చేస్తున్నారు.
వారిద్దరూ ఎప్పటి మాదిరిగానే డ్యూటీకి వెళ్లిపోయారు. అదే వీధిలో నివాసముంటున్న కనక మహాలక్ష్మి తల్లి ఉదయం 11 గంటల సమయంలో మనవరాలి వద్దకు వచ్చింది. తాను సచివాలయానికి వెళ్తానని మనవరాలు చెప్పడంతో ఆమె తన ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి ఒంటిగంట సమయంలో మళ్లీ మనవరాలి వద్దకు వచ్చి పిలవగా ఎంతసేపటికీ తలుపు తీయలేదు. దీంతో కిటికీలోంచి చూడగా బెడ్‌రూమ్‌లోని ఫ్యాన్ హుక్‌కు ప్రవల్లిక ఉరి వేసుకొని కనిపించింది. వెంటనే ఆమె తన భర్తకు విషయాన్ని చెప్పడంతో ఇంటి వెనుకభాగంలో గల తలుపును బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లి చూశారు.
ఫ్యాన్‌కు వేలాడుతున్న ప్రవల్లికను కిందికి దించి దగ్గరలోగల ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కనక మహాలక్ష్మి హుటాహుటిన వచ్చి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె నిఖిల్ అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్టు తెలిసిందని, అందువల్ల ఈ మృతిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరింది.