
జోనల్ క్రీడా పోటీలకు విశాఖ ఆతిథ్యం
ఈ నెల 22, 23 తేదీల్లో స్పోర్ట్స్ మీట్
మహారాణిపేట: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 22, 23 తేదీల్లో విశాఖ వేదికగా జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ తెలిపారు. ‘అమరావతి ఛాంపియన్‌షిప్ కప్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీలలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విశాఖ జిల్లాల నుంచి 1,800 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. పురుషులు, మహిళలకు కలిపి మొత్తం 10 క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కొమ్మాదిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, చంద్రపాలెం, రైల్వే ఇండోర్ స్టేడియంలలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. క్రీడాకారుల కోసం వసతి, తాగునీరు, వైద్య సేవలు, అంబులెన్స్ వంటి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పోటీలలో విజేతలు ఈ నెల 24 నుంచి 26 వరకు తిరుపతిలో జరిగే ఫైనల్స్‌లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులకు రెవెన్యూ కాలనీలోనీ జీవీఎంసీ బాలుర హైస్కూల్‌లో, బక్కన్న పాలెం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో వసతి ఏర్పాటు చేయాలని డీఈవో/ఆర్‌ఐవోలకు సూచించారు. 30మంది పీఈటీలు/పీడీల ను కేటాయించాలని డీఈవోకు సూచించారు. సమావేశంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి ఎస్. వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, జోనల్ కమిషనర్ కనకదుర్గ లక్ష్మి, జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ రాజశేఖరరెడ్డి, ఆర్‌ఐవో మురళీధరరావు పాల్గొన్నారు,