
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం
మహారాణిపేట: నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో విశాఖలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభమైంది. మంగళగిరి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ హబ్ యువతకు, స్టార్టప్‌లకు ఒక వేదికగా నిలవనుంది. వీఎంఆర్డీఏ డెక్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ హబ్‌ను ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక గేమ్ చేంజర్‌గా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అభివర్ణించారు. ఈ హబ్‌కు సీఈఓగా రవి ఈశ్వరపు, కన్వీనర్‌గా జేసీ కె. మయూర్ అశోక్ వ్యవహరిస్తారని తెలిపారు. అలాగే ఎనిమిది ప్రముఖ సంస్థలు ఈ హబ్‌తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో టీఐఈ వెజాగ్, ఐటీఏఏపీ వంటి సంస్థలు ఉన్నాయి. భవిష్యత్తులో స్టార్టప్‌లకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను ఈ హబ్ అందిస్తుంది. జీఎంఆర్ ప్రతినిధి టాటాతేజ, దివిస్ ల్యాబ్స్ నుంచి డాక్టర్ సురేష్, ఆర్సెలార్ మిట్టల్ నుంచి ఎం.రవీంద్రనాథ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ధనుంజయరావు, గీతం నుంచి డాక్టర్ రాజాపప్పు, ఐఐపీఈ నుంచి డాక్టర్ విజయ్ జ్ఞాన, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.