వణికిస్తున్న జ్వరాలు | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న జ్వరాలు

Aug 20 2025 5:05 AM | Updated on Aug 20 2025 5:05 AM

వణికిస్తున్న జ్వరాలు

వణికిస్తున్న జ్వరాలు

పెరుగుతున్న మలేరియా, డెంగ్యూ కేసులు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 89 మందికి మలేరియా, 153 మందికి డెంగ్యూ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో విచ్చలవిడిగా వసూళ్లు

రూ.60 వేలు ఖర్చు చేశా..

నా కుటుంబమంతా ప్రసాద్‌ గార్డెన్స్‌లో జీవీస్తున్నాం. నలుగురులో ఇద్దరికి జ్వరం వచ్చింది. నేను స్థానికంగా ఉన్న ప్రసాద్‌గార్డెన్స్‌ యూపీహెచ్‌సీలో వైద్యుడ్ని సంప్రదించాను. రక్త పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో డెంగ్యుగా నిర్థారణ అయింది. జ్వరం తగ్గకపోవడంతో నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరా. కొద్ది రోజుల తర్వాత జ్వరం అదుపులోకి వచ్చింది. కాని దాదాపు రూ.60 వేలు పైబడి బిల్లు వేశారు. పేద కుటుంబంలో జన్మించిన నాకు రూ.60 వేలు చెల్లించడం కష్టంగా మారింది. అప్పులు చేసి ఆస్పత్రి ఫీజు చెల్లించాల్సి వచ్చింది.

– నాయిని లక్ష్మి, ప్రసాద్‌గార్డెన్స్‌,పూర్ణామార్కెట్‌

సాధారణంగా జూలై–అక్టోబర్‌ మధ్య జ్వరాలు ఎక్కువగా వస్తాయి. కానీ ఈసారి ఎండలు ఉన్నప్పటికీ వర్షాలు పడుతుండటంతో దోమల బెడద తీవ్రంగా ఉంది. నగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, మురికి కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, మరియు పొంగి ప్రవహిస్తున్న భూగర్భ డ్రైనేజీలు కనిపిస్తున్నాయి. మురుగు కాలువల్లో పూడికలు తీయకపోవడంతో దోమల సంఖ్య భారీగా పెరిగి, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది. అయితే, దోమల నియంత్రణకు అవసరమైన ఫాగింగ్‌ యంత్రాలు మూలకు చేరడం గమనార్హం.

డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుదల

దోమల వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా వంటి జ్వరాలు ఇప్పుడు నగరవాసులను వెంటాడుతున్నాయి. డెంగ్యూ సాధారణంగా పగటిపూట కుట్టే దోమల వల్ల వ్యాపిస్తుంది. ఇది సాధారణ జ్వరంలా మొదలైనా, ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అధికారిక గణాంకాల ప్రకారం, డెంగ్యూ, మలేరియా కేసులు భారీగా నమోదయ్యాయి. జిల్లాలో 4,399 మందికి డెంగ్యూ రక్త పరీక్షలు చేయగా, 153 కేసులు నిర్ధారణ అయ్యాయి. మలేరియా కోసం 1,28,799 మందికి పరీక్షలు చేయగా, 89 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమేనని, అనధికారికంగా కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిట

పెరుగుతున్న జ్వరాల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులైన కేజీహెచ్‌, విమ్స్‌, అలాగే ప్రైవేటు క్లినిక్‌లు, ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. కేజీహెచ్‌లోని భావనగర్‌ వార్డులో డెంగ్యూ, మలేరియా బాధితులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. రోజుకు సుమారు 10 నుంచి 20 మంది జ్వర బాధితులు ఓపీకి వస్తున్నారు. విమ్స్‌లో రోజుకు 15 నుంచి 20 మంది ఓపీకి వస్తుండగా, వీరిలో 5 నుంచి 8 మంది డెంగ్యూ బాధితులే ఉన్నారు.

డెంగ్యూ పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ

ప్రైవేటు ఆసుపత్రులు ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నాయి. డెంగ్యూ బాధితుల నుంచి భారీగా బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ప్లేట్‌లెట్స్‌ తగ్గితే ప్రాణానికే ప్రమాదం’ అంటూ రోగులను భయపెట్టి, ఒక్కో కేసు నుంచి రూ.60,000 నుంచి రూ.1 లక్ష వరకు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. రక్తం ఎక్కించాల్సిన అవసరం వస్తే బిల్లులు ఇంకా పెరుగుతున్నాయి.

నగరంలో అనూహ్యంగా పెరుగుతున్న జ్వరాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదివరకూ కేవలం గిరిజన ప్రాంతాలకే పరిమితమైన మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్‌ వ్యాధులు ఇప్పుడు నగర ప్రాంతాల్లోనూ విపరీతంగా వ్యాపిస్తున్నా యి. అడపాదడపా కురుస్తున్న వర్షాలు, పారిశుద్ధ్య లోపం, మరియు పేరుకుపోతున్న చెత్తాచెదారం కారణంగా దోమలు విపరీతంగా పెరిగి, ఈ జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్నాయి. – మహారాణిపేట

జ్వరంతో ఇబ్బంది పడుతున్నా..

నా కుటుంబం ఎగురరెల్లి వీధి,కొడిపందెల వీధిలో ఉంటున్నాం. నేను,నా భర్త చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ప్రతి రోజూ సాయంత్రం సమయంలో చలి జ్వరం వస్తోంది. రెండు రోజులు ఇంటి వద్దే ఉన్నాను. పనికి వెళ్లక పోతే కుటుంబ పోషణ జరగడం కష్టంగా ఉంది. జ్వరం అదుపులోకి రాలేదు. జబ్బరితోటలో ఉన్న యూపీహెచ్‌సీలో వైద్యున్ని సంప్రదించా.. చలి జ్వరం కావడంతో మలేరియా పరీక్షలు చేయగా.. మలేరియాగా నిర్థారణ అయింది.

– దశమంతుల రామలక్ష్మి, ఎగువ రెల్లివీధి,

కోడిపందెల వీధి, 30వ వార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement