
22న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఈ నెల 22న నిర్వహించనున్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించనున్న కౌన్సిల్ సమావేశంలో 84 అంశాలు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి. వీటిలో పలు అభివృద్ధి పనులతో పాటు వివిధ విభాగాలకు సంబంధించి సర్వీస్ అంశాలు, రెవెన్యూ అంశాలు చర్చకు రానున్నాయి. జీవీంసీ పరిధిలో ఉన్న పలు బీచ్‌ల్లో 20 మంది అదనపు బీచ్ లైఫ్‌గార్డ్స్ నియామకం, 15వ ఆర్థిక సంఘం గ్రాంటులోని తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, శానిటేషన్ కోసం 2021–22 ఏడాదికి సవరించిన వార్షిక అభివృద్ధి ప్రణాళిక ఆమోదం, జోన్–1 పరిధి 2వ వార్డులో రూ.కోటి 70 లక్షలతో బీటీ రోడ్డు విస్తరణ, జోన్–2 పరిధి ఎండాడలో రూ.89 లక్షలతో బీటీ రోడ్డు, జోన్–4 పరిధి 32వ వార్డు సౌత్‌జైల్ రోడ్డు అంబేడ్కర్ సర్కిల్ నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఎదురుగా ఉన్న ఐల్యాండ్ వరకు రూ.కోటి 45 లక్షలతో బీటీ రోడ్డు పునరుద్దరణ, అలాగే భీమిలి, గాజువాక, జోన్–3, జోన్–4, జోన్–5 పరిధిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి.