
వర్షం ఆగి.. వెతలు మిగిలి
ఒడిశాలోని గోపాల్‌పూర్ వైపు వెళ్లిన అల్పపీడనం
రెండు రోజుల్లో.. రికార్డు స్థాయిలోవర్షం
భీమిలిలో అత్యధికంగా 170.75 మి.మీ.
జిల్లాలో 12 చోట్ల 100 మి.మీ.కు పైగా వర్షపాతం నమోదు
కొబ్బరితోటలో కూలిన ఇంటి శ్లాబ్..
ఒకరికి గాయాలు
సాక్షి, విశాఖపట్నం: భారీ వర్షంరెండు రోజుల పాటు మహా నగరాన్ని ముంచెత్తింది. విశాఖ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం అలజడి రేపింది. వాయుగుండంగా బలపడే అవకాశం ఉండటంతో.. రెడ్ అలెర్ట్ జారీ చేసినా.. చివరికి వరుణుడు కరుణించడంతో.. వర్షం తగ్గుముఖం పట్టింది. అల్పపీడనం క్రమంగా బలపడుతూ ఒడిశాలోని గోపాల్‌పూర్ వైపు కదలడంతో.. విశాఖ ఊపిరి పీల్చుకుంది. సోమవారం మధ్యాహ్నం వరకూ మోస్తరు వర్షం కురిసింది. పెందుర్తి మండలం అక్కిరెడ్డి పాలెంలో అత్యధికంగా 31.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, సీతమ్మధారలో 31, మహారాణిపేటలో 28.5, గాజువాకలో 25.25, పెదగంట్యాడలో 24.5, గురుద్వారలో 24.3, పెందుర్తిలో 23.5, హెచ్‌బీ కాలనీలో 23.25 మిమీ వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం తర్వాత వాతావరణం తెరిపినివ్వడంతో ప్రజలు సాధారణ పనుల్లో నిమగ్నమైపోయారు. అయితే.. రెండు రోజుల పాటు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 12 చోట్ల 100 మిమీకి పైగా వర్షపాతం నమోదు కావ డం విశేషం. మరో రెండు రోజుల పాటు తేలికపాటి జల్లులు తప్ప భారీ వర్షాలకు అవకాశం లేదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది.
డాబాగార్డెన్స్: నగరంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా తలెత్తే సమస్యల పరిష్కారానికి జీవీఎంసీ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోందని కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తనతోపాటు మేయర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, అధికార యంత్రాంగం నిరంతరం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటోందన్నారు. రాపిడ్ యాక్షన్ రెస్పాన్స్ టీమ్స్ ద్వారా సమస్యల్ని సత్వరమే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన గెడ్డలు పరిశీలించి, వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకాల్లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శిథిలావస్థ భవనాలు, కొండవాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు రక్షణ కల్పించే దిశగా వారిని జీవీఎంసీ సామాజిక భవనాలు, పాఠశాలల్లో ఆశ్రయం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బలమైన గాలులకు హోర్డింగ్‌లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయం సందర్భాల్లో తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ట్యాంకర్లను సిద్ధం చేశామన్నారు. వర్షాల వల్ల వ్యాపించే వ్యాధుల నివారణకు సరిపడా క్లోరిన్ లిక్విడ్, ఆలం నిల్వ ఉంచినట్లు వెల్లడించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అన్ని జోనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ప్రధాన కార్యాలయంలో ఉన్న సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా సంబంధిత అధికారులకు చేరవేసి, చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా జీవీఎంసీ కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నెం.1800 4250 0009ను సంప్రదించవచ్చన్నారు. ఇప్పటి వరకు జీవీఎంసీ కమాండ్ కంట్రోల్ నెంబర్‌కు 97 ఫిర్యాదులు రాగా, 94 ఫిర్యాదుల్ని పరిష్కరించినట్లు తెలిపారు. విద్యుత్ దీపాల సమస్యల పరిష్కారానికి 280 మంది ఎలక్ట్రికల్ సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు.
వాయు‘గండం’ గడిచింది!

వర్షం ఆగి.. వెతలు మిగిలి